Demolitions Started At Musi Bed River :మూసీ నది ప్రక్షాళనలో భాగంగా మరో అడుగు ముందుకు పడింది. నదీ గర్భంలో అక్రమంగా నిర్మించిన ఇళ్లను ప్రభుత్వం కూల్చివేస్తోంది. హైదరాబాద్ జిల్లా పరిధిలోని చాదర్ ఘాట్, శంకర్ నగర్, వినాయక వీధి, రసూల్ పురా, మూసానగర్ ప్రాంతాల్లో నిర్వాసితుల ఇళ్లను రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. సుమారు 100 మంది అడ్డా కూలీల సహకారంతో సమ్మెట, గుణపాలతో అక్రమ నిర్మాణాలపై విరుచుకుపడ్డారు. ఒక్కొక్క ఇంటిని పెకిలిస్తూ పోయారు. ఓవైపు కూల్చివేతలు కొనసాగుతుండగా మరోవైపు మార్కింగ్ చేసిన ఇళ్లలోని పలు కుటుంబాలు హుటాహుటినా సామగ్రిని సర్దుకొని వారికి కేటాయించిన రెండు పడకల గదుల ఇళ్లకు వెళ్లిపోయారు. కూల్చివేత ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు, జీహెచ్ఎంసీ సిబ్బంది పర్యవేక్షించారు.
మూసీ నది ప్రక్షాళనకు శ్రీకారం :హైదరాబాద్ మహానగరంలో మూసీ నది ప్రక్షాళనకు శ్రీకారం చుట్టిన రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో అడుగు ముందుకు వేస్తోంది. అందులో భాగంగా తొలి దశలో మూసీ నది గర్భంలోని అక్రమ నిర్మాణాలను తొలగించాలని నిర్ణయించిన ప్రభుత్వం వారం రోజుల నుంచి సర్వే నిర్వహించింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో ప్రవహించే మూసీ నది గర్భంలో సుమారు 2 వేలకుపైగా నిర్మాణాలున్నట్లు గుర్తించి అందులో నివసిస్తున్న కుటుంబాలను ఖాళీ చేయించాలని రెవెన్యూ అధికారులకు సూచించింది.
పునరావాసం కల్పిస్తామని భరోసా : ఈ మేరకు రంగంలోకి దిగిన అధికారులు నదీ గర్భంలో ఉన్న నిర్మాణాలకు మార్కింగ్ చేసి బాధిత కుటుంబాలకు జీహెచ్ఎంసీ పరిధిలోనే పునరావాసం కల్పిస్తామని భరోసా కల్పించారు. నగరంలోని 14 చోట్ల రెండు పడకల గదుల గృహా సముదాయాల్లో ఖాళీగా ఉన్న వాటిని కేటాయించి నిర్వాసితులు స్వచ్ఛందంగా ముందుకు రావాలని కోరారు. అధికారుల సూచనలతో నదీ గర్భంలో ఇబ్బందికరమైన పరిస్థితుల్లో జీవిస్తున్న పలు కుటుంబాలు స్వచ్చందంగా ముందుకు వచ్చి ఇళ్లను ఖాళీ చేశాయి. తమకు కేటాయించిన రెండు పడకల గదుల ఇళ్లకు తరలివెళ్లిపోయారు. దీంతో తర్వాత ప్రక్రియగా ఆ నిర్మాణాలను కూల్చివేయాలని నిర్ణయించిన ప్రభుత్వం నేటి నుంచి మూసీ నది గర్భంలో ఉన్న నివాసాల కూల్చివేతలు మొదలుపెట్టింది.
హైదరాబాద్ జిల్లా పరిధిలోని చాదర్ ఘాట్, శంకర్ నగర్, వినాయకవీధి, రసుల్ పురా, మూసానగర్ ప్రాంతాల్లోని నివాసాలను కూల్చివేశారు. సుమారు 200కుపైగా కుటుంబాలు నదీ గర్భంలో ఇక్కడ ఏళ్ల తరబడి జీవిస్తున్నాయి. అందులో కొంత మంది ఖాళీ చేసి వెళ్లిపోవడంతో మలక్ పేట ఎమ్మెల్యే బలాల సహకారంతో సుమారు 100 మంది కూలీలతో అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. ఇటీవల హైకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో కూల్చివేతల విషయంలో జేసీబీలను దూరంగా పెట్టిన రెవెన్యూ అధికారులు కూలీల సహాయంతో మూసీ నది గర్భంలోని నిర్మాణాలను ధ్వంసం చేశారు. సమ్మెట, గుణపాలతో ఇళ్లపై కూలీలు విరుచుకుపడి ఒక్కో ఇంటికి పెకిలించారు. ఒక్క శంకర్ నగర్ లోనే 100కుపైగా నివాసాలను కూల్చివేశారు. కొన్నింటిని పూర్తిగా ధ్వంసం చేయగా మరికొన్ని నివాసాలను పాక్షికంగా కూల్చివేశారు.