తెలంగాణ

telangana

ETV Bharat / state

రిజర్వాయర్​లో కోళ్ల కళేబరాలు - ఆందోళన వద్దన్న అధికారులు - AKKAMPALLY RESERVOIR

హైదరాబాద్, సికింద్రాబాద్‌ నగరాలకు తాగు నీరు అందిస్తున్న అక్కంపల్లి జలాశయం - రిజర్వాయర్​లో చనిపోయిన కోళ్లు - నిందితుడి అరెస్ట్‌ - నీటి శాంపిల్స్​ను హైదరాబాద్‌లోని ల్యాబ్‌కు పంపిన అధికారులు

akkampally reservoir in nalgonda
akkampally reservoir in nalgonda (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Feb 15, 2025, 3:50 PM IST

Updated : Feb 15, 2025, 5:00 PM IST

Dead Chickens Akkampally Reservoir : నల్గొండ జిల్లా పెద్ద అడిశర్లపల్లి మండలంలోని అక్కంపల్లి జలాశయంలో శుక్రవారం(ఫిబ్రవరి 14న) కోళ్ల కళేబరాలు తేలడం కలకలం సృష్టించింది. మృతి చెందిన కోళ్లను రిజర్వాయర్​లో పడేశారని స్థానికలు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ జలాశయం నుంచే హైదరాబాద్, సికింద్రాబాద్‌ నగరాలతో పాటు నల్గొండ జిల్లాలోని దాదాపు 500 గ్రామాలకు తాగునీరు, సాగునీరు అందిస్తున్నారు. స్థానికుల సమాచారంతో శుక్రవారం ఉదయం జలాశయం వద్దకు చేరుకున్న అధికారులు చనిపోయిన 60 కోళ్ల కళేబరాలను జలాశయంలో నుంచి బయటికి తీశారు.

నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు : అనంతరం చనిపోయిన కోళ్లను పెద్ద గుంత తీసి అందులో వేసి పూడ్చారు. ఈ ఘటనపై పెద్ద అడిశర్లపల్లి పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. చనిపోయిన కోళ్లను జలాశయంలో పడేసిన పడమటి తండాకు చెందిన రామావత్‌ రాజమల్లును అరెస్ట్‌ చేసినట్లు దేవరకొండ అడిషనల్ ఎస్పీ మౌనిక తెలిపారు. నీటి శాంపిల్స్​ను హైదరాబాద్‌లోని ల్యాబ్‌కు పంపించినట్లు వివరించారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరంలేదని హైదరాబాద్ మెట్రో పాలిటన్ వాటర్ సప్లై & సీవరేజ్ బోర్డు మేనేజింగ్ డైరెక్టర్​ అశోక్‌రెడ్డి తెలిపారు.

మూడు సార్లు క్లోరినేషన్​ : అక్కంపల్లి రిజర్వాయర్ నుంచి వచ్చే తాగు నీటిని హైదరాబాద్‌కు సరఫరా చేయడానికి ముందు కోదండపూర్ వాటర్ ప్లాంట్‌లో శుద్ధి చేస్తారని జలమండలి ఎండీ అశోక్ ​రెడ్డి తెలిపారు. ఐఎస్‌ఐ ప్రమాణాల ప్రకారం నీటి సరఫరాకు దశల వారీగా మూడు సార్లు క్లోరినేషన్‌ ప్రక్రియ ఉంటుందని చెప్పారు. నీటి నమూనాలను క్వాలిటీ అస్యూరెన్స్ అండ్ టెస్టింగ్ వింగ్, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్​కు పంపించామని, అక్కడి నుంచి నివేదికలు వస్తేనే నీటిని సరఫరా చేయనున్నట్లు వెల్లడించారు. దీనిపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.

ఆందోళన వద్దు : అక్కంప‌ల్లి రిజ‌ర్వాయ‌ర్​లో కోళ్ల ఘటన తెలుసుకుని నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి జలాశయాన్ని పరిశీలించారు. ఇరిగేషన్, పోలీస్, రెవెన్యూ, వెటర్నరీ, జలమండలి తరఫున వెంటనే మల్టీ డిసిప్లీనరీ టీం ఏర్పాటుకు ఆదేశించారు. ఈ ఘ‌ట‌న‌పై ప్రజ‌లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్ త్రిపాఠి తెలిపారు. ప్రాథమికంగా ఎలాంటి అవశేషాలు గుర్తించ‌లేదని, రాబోయే పది రోజుల పాటు ప్రతి గంట‌కూ నీటి ప్రమాణాలను ప‌రీక్షిస్తామన్నారు. నగర ప్రజలకు శుద్ధిచేసిన నీటిని అందించేందుకు ఐఎస్ఐ ప్రమాణాల్ని పాటిస్తున్నామని ఆమె వెల్లడించారు. మూడంచెల క్లోరిన్ ప్రక్రియ ద్వారా నీటి స‌ర‌ఫ‌రా జ‌రుగుతుందని, శాస్త్రీయంగా తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలనూ తీసుకుంటున్నట్లు ఇలా త్రిపాఠి పేర్కొన్నారు.

కిలోల కొద్దీ కుళ్లిన చికెన్ - బార్లకు ఇక్కడి నుంచే సరఫరా!

చికెన్, గుడ్లు తినడం ప్రమాదకరమా? - ఇదిగో సమాధానం

Last Updated : Feb 15, 2025, 5:00 PM IST

ABOUT THE AUTHOR

...view details