Heavy Rain Alert to Andhra Pradesh :ఆంధ్రప్రదేశ్‌కు మరో ముప్పు పొంచి ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్రంగా బలపడుతుంది. ప్రస్తుతం పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతున్న నేపథ్యంలో తీవ్రంగా అల్పపీడనంతో బలపడనుందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో అల్పపీడన ప్రభావంతో మూడు రోజుల పాటు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.
దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. మంగళవారం నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు, ప్రకాశం, అన్నమయ్య జిల్లాల్లో భారీ వానలు పడే అవకాశమున్నట్లు వివరించింది. భారీ వర్షాలు కురుస్తాయన్న హెచ్చరికల నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పడీనం బుధవారానికి(రేపటికి) తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు తెలుపుతున్నారు. ఈ తుపాను ఈనెల 17న చెన్నై సమీపంలో తీరం దాటుతుందని అంచనా వేశారు.
ముందస్తు చర్యలపై సీఎం సమీక్ష :ఏపీలో భారీ వర్షాలు కురిసే నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను సూచించారు. రెవెన్యూ, పోలీస్, పంచాయతీ రాజ్, నీటిపారుదల, ఆర్ ఎండ్ బీ, విద్యుత్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, ఆస్తి, ప్రాణనష్టం లేకుండా చూడాలని సీఎం చంద్రబాబు సూచనలు చేశారు. వాతావరణ శాఖ ఎప్పటికప్పుడు పరిస్థితిని అంచనా వేశాయన్నారు.
తెలంగాణలో 3 రోజుల పాటు వానలు - ఏ ఏ జిల్లాల్లో వర్షాలు ఉన్నాయో తెలుసా?