Cyber Criminals Looted Huge Money from Hyderabad Doctor : తక్కువ కాలంలో అధిక రాబడులు పొందాలని అనుకున్నాడు ఆ వైద్యుడు. అందుకు షేర్ ట్రేడింగ్‌లో అధికంగా డబ్బులను పెట్టాడు. ముందుగా అధికంగా లాభాలు రావడంతో ఎక్కువ మొత్తం డబ్బులను అందులో పెట్టాడు. ఆ యాప్ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయానని గుర్తించాడు. ఏకంగా రూ.8,60,38,022 కోట్లను పోగొట్టుకుని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ కేసు తెలంగాణలో నమోదైన సైబర్ నేరాల చరిత్రలో అతిపెద్ద ఆన్లైన్ మోసంగా పోలీసులు చెబుతున్నారు. ఈ మోసం హైదరాబాద్‌లోని కేపీహెచ్బీలో జరిగింది.
వివరాల్లోకి వెళ్తే.. మే 21న వైద్యుడి ఫేస్బుక్ ఖాతాను బ్రౌజ్ చేస్తుండగా స్టాక్ బ్రోకింగ్ కంపెనీల పేరిట ప్రకటన కనిపించింది. ఎలాగో తాను స్టాక్‌లలో ఇన్వెస్ట్ చేస్తాను కదా అని అందులో అడిగిన వివరాలను నింపి పంపారు. ఆ వెంటనే ఆ కంపెనీల ప్రతినిధులుగా వాట్సాప్‌లో వైద్యుడిని కొందరు సంప్రదించారు. ఆయన ఫోన్ నంబర్‌ను నాలుగు గ్రూపుల్లో చేరారు. ఇన్వెస్టర్లకు లాభాలు తెప్పించడమే తమ సంస్థ విధి అని వారు డాక్టర్‌తో చెప్పారు. అయితే ఆయా సంస్థలకు సంబంధించి ఎన్ఎస్ఈ, బీఎస్ఈ లాంటి రెగ్యులేటరీ సంస్థల గుర్తింపు, ట్యాక్స్ రిజిస్ట్రేషన్ల గురించి వైద్యుడు వారిని అడిగారు. అయితే అలాంటి రహస్యంగా ఉంచుతామని వెల్లడించడానికి వీల్లేదని అన్నారు.
ఈ క్రమంలో 4 సంస్థల పేరిట యాప్ లింక్‌లను వైద్యుడికి వారు పంపించారు. వాటిల్లో సూచించిన బ్యాంకు ఖాతాలకు ఒకరోజు రూ.23.56 లక్షలు, మర్నాడే మరో రూ.3 లక్షలు, తర్వాతి రోజు రెండు విడతలుగా రూ.68 లక్షలు, ఆ మర్నాడు రూ.17.10 లక్షలు ఇలా ఏకంగా 63 విడతల్లో రూ.8,60,38,022 కోట్లను పంపించాడు. తొలుత వారు లాభాలు ఉపసంహరించుకునేందుకు అవకాశమివ్వడంతో వైద్యుడి నమ్మకం ఏర్పడి ఇలా ఇంత మొత్తం చెల్లించాడు.