New Cyber Security Strategy in Hyderabad : ముల్లును ముల్లుతోనే తీయాలి. వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలన్నది పెద్దలు చెప్పిన సూత్రం. ఈ సూత్రం ప్రకారమే సైబర్ దొంగలపై సైబర్ పోలీసులు సాంకేతిక పరిజ్ఞానం ప్రయోగిస్తున్నారేమో. ఎందుకంటే సాంకేతిక పరిజ్ఞానాన్ని అడ్డుపెట్టుకొని నేరగాళ్లు చెలరేగిపోతుంటున్నారు ఇప్పుడు అదే పరిజ్ఞానంతో పోలీసులు కూడా వారికి ముక్కుతాడు వేస్తున్నారు. అయితే ఈ అస్త్రం వారిపై బ్రహ్మాస్త్రంగా పని చేసి సత్ఫలితాలను ఇస్తోంది.
దేశంలో ఏ నేరం జరిగిన నిందితుడిని పట్టుకోవడమే కాదు అతనిపై ఎన్ని కేసులు, నేరాలు చేశాడనే సమస్త సమాచారం క్షణాల్లో తెలిసిపోతుంది. ఈ ఆధునిక సాంకేతికను అందిపుచ్చుకుంది ఏ రాష్ట్ర సైబర్ పోలీసులో కాదు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరోనే. అందుకే ఉత్తమ పనితీరులో భాగంగా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ప్రత్యేక అవార్డును కూడా ఇవ్వనుంది. సైకాప్స్ పేరుతో చేసిన ప్రయోగం సత్ఫలితాలను ఇవ్వడంతో పాటు ఈ తరహా టూల్స్ మరిన్ని అభివృద్ధి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఒక్క క్లిక్‌తో మొత్తం తెలిసేలా : సైబర్ నేరగాళ్లు ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో రాష్ట్రంలో పదివేలకు పైగా మోసాలు చేశారు. ఇవి రికార్డుల్లో ఉన్నవి. కానీ రికార్డుల్లో లేనివి ఇంక ఎన్నో. సరికొత్త రీతుల్లో మోసాలకు పాల్పడుతూ చాకచక్యంగా తప్పించుకుంటున్నారు. ఒకే దగ్గర కాకుండా ఇతర రాష్ట్రాలు, దేశాల్లో ఉండి నేరాలకు పాల్పడుతుండడంతో వారిని గుర్తించడమే దర్యాప్తు అధికారులకు అతిపెద్ద సవాలుగా మారిందంటే పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.
ఈ కఠిన పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని టీజీసీఎస్బీ సైబర్ నేరగాళ్లపై సాంకేతిక అస్త్రం ప్రయోగిస్తోంది. సైబర్ అధికారులు రూపొందించిన సాఫ్ట్వేర్ ద్వారా మోసం చేయడానికి నేరస్థుడు వాడిన ఫోన్ నంబర్‌ను కంప్యూటర్లో ఎంటర్ చేస్తే చాలు. ఆ నంబరుతో దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడ కేసులు నమోదు అయ్యాయి. అది ఎవరి పేరు మీద ఉన్నది అనే విషయాలు తెలుస్తాయి. ప్రస్తుతం ఆ ఫోన్ ఏ ప్రాంతంలో ఉంది, దీని ద్వారా ఎన్ని సామాజిక మాధ్యమ ఖాతాలు నడుస్తున్నాయి, ఎన్ని బ్యాంకు ఖాతాలు అనుసంధానమై ఉన్నాయనే విషయాలు క్షణాల్లో తెలిసిపోతాయి. ఒక్కసారి ఈ సమాచారం చేతికి వస్తే చాలు నేరగాడి ఆట కట్టించవచ్చని సైబర్ నిపుణులు తెలుపుతున్నారు.