Kidnapping Frauds in Telangana 2024 : సైబర్ నేరగాళ్లు యథేచ్ఛగా మోసాలకు పాల్పడుతున్నారు. రోజుకో కొత్త పంథాతో ప్రజలను బురిడీ కొట్టిస్తున్నారు.సైబర్ నేరాలపై పోలీసులు ఎంతగా అవగాహన కల్పించినా బాధితుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఓవైపు ఉద్యోగాలు, బహుమతులు అనే ఆశలను ఎరగా వేస్తున్నారు. మరోవైపు ప్రముఖ వ్యక్తుల సోషల్ మీడియా ఖాతాల డీపీలు ఉపయోగించి డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. కానీ వారు ఇప్పుడు రూట్ మార్చారు. తాజాగా 'విదేశాల్లో చదువుతున్న మీ పిల్లలను కిడ్నాప్ చేశామని అడిగినంత ముట్టజెప్పాలని లేకుంటే వారు మీకు మిగలరని' బెదిరిస్తూ సైబర్ మోసగాళ్లు సరికొత్త పంథాలో ప్రజలను దోచుకుంటున్నారు.
ఇలాంటి వాటిపట్ల అప్రమత్తంగా ఉండాలని, అలాంటి ఫోన్‌కాల్స్ వస్తే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు చెబుతున్నారు. పిల్లలకు నేరుగా ఫోన్ చేయాలని, వారు చదువుతున్న విద్యా సంస్థల ద్వారా సమాచారాన్ని తెలుసుకుని కేటుగాళ్ల మోసాలను తిప్పికొట్టాలని సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు సూచిస్తున్నారు.
ఇటీవలి ఘటనలే ఆధారం : అమెరికాలోని క్లీవ్‌ల్యాండ్‌లో మహ్మద్ అబ్దుల్ అర్భాత్ అనే భారతీయ విద్యార్థి మార్చి 7వ తేదీన కిడ్నాప్‌నకు గురయ్యాడు. పది రోజుల తర్వాత ఆయణ్ని విడుదల చేయడానికి 1200 అమెరికన్ డాలర్లు డిమాండ్ చేస్తూ తల్లిదండ్రులకు ఫోన్‌కాల్ వచ్చింది. ఆ తర్వాత ఆ యువకుడు వారి చేతిలో దారుణంగా హత్యకు గురయ్యాడు. ఈ సంవత్సరం ఆరంభంలో విదేశాల్లో ఇద్దరు భారతీయ విద్యార్థుల విషయంలోనూ ఈ తరహా రెండు ఘటనలు నమోదయ్యాయి. సైబర్ నేరగాళ్లు తల్లిదండ్రులకు వీఓఐపీ కాల్స్ చేసి భయభ్రాంతులకు గురిచేసి డబ్బులు లాగుతున్నారు.