Cyber Frauds in Nizamabad : నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం రాంపూర్ చెందిన ఓ యువతికి, ఇటీవల సైబర్ నేరగాళ్లు ఫోన్ చేశారు. మీ నాన్న డ్రగ్స్ కేసులో ఇరుక్కున్నాడని, వదిలిపెట్టాలంటే వెంటనే 10 వేలు పంపించాలని లేదంటే చేతులు తీసేస్తామని బెదిరించారు. మోపాల్ మండలానికి చెందిన భూమేశ్‌కు ఓ అపరిచితుడు ఫోన్ చేసి, మీ కోడలు గౌతమి తమ అదుపులో ఉందని బెదిరించాడు. అనుమానం వచ్చిన భూమేశ్, తన కోడలు క్షేమ సమాచారాన్ని తెలుసుకున్నాడు.
బెదిరింపు కాల్స్ : నిందితుడుకి మళ్లీ వీడియో కాల్ చేసి తన కోడలు క్షేమంగా ఉందని చెప్పడంతో, వీడియోకాల్‌లో ఓ మహిళను చూపించి ఆమెను అత్యాచారం చేశావని కేసు పెడతా అంటూ బెదిరించాడు. భూమేశ్ ఠాణాకు వెళ్తున్నానని చెప్పడంతో, ఫోన్ కట్ చేశాడు. ఇలాగే కామారెడ్డికి చెందిన ఒకరిని బెదిరించి లక్షరూపాయలు కాజేశారు. డొంకేశ్వర్ మండలం గంగసముద్రానికి చెందిన ముత్యంరెడ్డికి గుర్తు తెలియని నెంబర్ నుంచి వాట్సాప్‌లో బ్యాంకు లోగోతో రెండు లింక్‌లు వచ్చాయి.
బ్లాక్ మెయిలింగ్ : మరుసటి రోజు లింక్‌ను క్లిక్ చేయడంతో బ్యాంకు ఖాతా నుంచి డబ్బులు కట్ అయ్యాయని మేసేజ్ రావడంతో బ్యాంకుకు వెళ్లి ఖాతా చూసుకుంటే మొత్తం ఖాళీ అయ్యింది. తన కుమార్తె పెళ్లి కోసం దాచుకున్న 4 లక్షలు పోయాయని బాధితుడి పోలీసుల వద్ద మొరపెట్టుకున్నాడు. తాజాగా జక్రాన్‌పల్లి మండలం పడ్కల్‌కు చెందిన రాములు అనే వ్యక్తిని, సైబర్ నేరగాళ్లు బురిడీ కొట్టిచారు. తాము పోలీసులమని మీ కుమారుడు గంజాయి కేసులో తమ ఆధీనంలో ఉన్నాడని బెదిరింపులకు పాల్పడ్డారు.