Chinese Cyber Criminals Fraud with Indian youth : సైబర్ వలలో చిక్కి మోసపోయేది మనోళ్లే, మోసగించేదీ మనోళ్లే. కానీ దాని వల్ల లాభపడేది మాత్రం చైనా ముఠాలు. ఇప్పుడు సైబర్ నేరాల్లో నడుస్తున్న కొత్త ట్రెండ్ ఇదే. సూత్రధారులంతా చైనా దుండగులే అయినా ఎక్కడా తమ జాడ తెలియకుండా జాగ్రత్తలు తీసుకుంటూ వేల కోట్ల రూపాయలను దోచుకుంటున్నారు. ఇదంతా ‘గోల్డెన్ ట్రయాంగిల్’లోని అడ్డాల్లో సాగుతున్న కొత్త తరహా సైబర్ నేరాల దందా. తాజాగా కేంద్ర దర్యాప్తు సంస్థల విశ్లేషణలో వెల్లడైన సమాచారం విస్తుపోయేలా చేస్తోంది. మొదట సోషల్ మీడియా ద్వారా కాల్‌సెంటర్ లేదా డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలకు ఆకర్షణీయమైన వేతనాలంటూ ప్రకటనలు వేసి ఏజెంట్ల ద్వారా యువకులను లావోస్, మయన్మార్, థాయ్‌లాండ్ సరిహద్దులతో కూడిన ‘గోల్డెన్ ట్రయాంగిల్’కు రప్పిస్తున్నారు.
అక్కడే చైనా సైబర్ ముఠాలు అడ్డాలు ఏర్పాటు చేసుకున్నాయి. ఉద్యోగం కోసం వెళ్లిన యువకులను విమానాశ్రయాల నుంచే ముఠా సభ్యులు తమ అడ్డాలకు తరలించి పాస్‌పోర్టు తీసుకుంటున్నారు. యువతకు 15 రోజులపాటు సైబర్ నేరాలు చేసేలా శిక్షణ పేరిట మెలకువలు నేర్పిస్తున్నారు. ఈ మోసాలు చేయడానికి ఒప్పుకోకపోతే బెదిరింపులు, చిత్రహింసలకు సైతం గురిచేస్తున్నారు. కొందరు దైర్యం చేసి అక్కడి భారత ఎంబసీకి ఫిర్యాదు చేసివారికి చైనా సైబర్ ముఠా నుంటి విముక్తి లభిస్తోంది. సైబర్ మోసాలకు పాల్పడి కొట్టేసిన సొమ్మును మొదట బ్యాంక్ ఖాతాల్లోకి తరలిస్తున్నారు.
కమీషన్లకు ఆశపడి ముఠాలకు బ్యాంకు ఖాతాలు : తర్వాత ఆయా ఖాతాల నుంచి వెంటనే పలు ఖాతాల్లోకి మార్చేస్తున్నారు. సైబర్ కేసు దర్యాప్తు క్రమంలో తొలుత బాధితుడి సొమ్ము బదిలీ అయిన ఖాతాదారుడిని పోలీసులు పట్టుకుంటున్నారు. సైబర్ ముఠాలు ఇచ్చే కమీషన్‌కు ఆశపడి తమ పేరిట బ్యాంకు ఖాతాను తెరిచి నగదు లావాదేవీల నిర్వహణ అంతా ముఠాలకే అప్పగిస్తున్నారు. వీరినే మ్యూల్స్ అని అంటారు. రెండురోజుల క్రితం తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో రాజస్థాన్‌లో అరెస్ట్ చేసిన 27 మంది ఇలాంటి వారే. దర్యాప్తు బృందాలు మ్యూల్స్‌ను గుర్తించేలోగా నగదు ఇతర ఖాతాల్లోకి బదిలీ అవుతోంది. వెంటనే సైబర్ ముఠాల ఏజెంట్లు ఆ సొమ్మును క్రిప్టోకరెన్సీల్లోకి మార్చి క్రిప్టోఎక్స్ఛేంజీల ద్వారా విదేశీ ఖాతాల్లోకి పంపించేస్తున్నారు.