Cyber Cases In Hyderabad : నగరంలో నేరాల తీరే వేరు. నేరగాళ్లు, మోసగాళ్లు వారి పంథాలను మార్చుకుంటున్నారు. వీరి ఉచ్చులో చిక్కి బలవుతున్న వారిలో విద్యావంతులే ఎక్కువగా ఉండటం విశేషం. ఆర్థిక నేరాలు, డ్రగ్స్ దందా నగరంలో ఈ సంవత్సరం పెరిగింది. పోలీసులకు చిక్కకుండా ఎక్కడో ఉంటూ ఇక్కడ సైబర్ నేరాలు సవాలు విసురుతున్నాయి. కొత్త సంవత్సరంలోనైనా ఇలాంటి విషయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలనే విషయాన్ని 2024 సంవత్సరం సూచిస్తోంది.
డిజిటల్ అరెస్టుల పేరుతో మోసాలు: పెరుగుతున్న ఖర్చులు చాలీచాలని జీతాలతో అదనపు ఆదాయం కోసం మధ్యతరగతి కుంటుంబాలు ప్రత్నామ్నాయాలపై మొగ్గు చూపుతున్నారు. పార్ట్‌టైమ్ ఉద్యోగాల పేరుతో, పెట్టుబడులు, స్టాక్‌మార్కెట్లు మాయలో పడి ప్రజలు మోసపోతున్నారు. ఈ సంవత్సరం కొత్తగా కొందరు మాయగాళ్లు డిజిటల్ అరెస్టులు, పిల్లలను కిడ్నాప్ చేశామంటూ డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. కొందరు మా సంస్థలో పెట్టుబడితో రెండేళ్లలో మూడింతల ఆదాయం అంటూ కొందరు సొంతింటి కలను నిజం చేసుకునేందుకు ప్రీలాంచింగ్ ఆఫర్లు, ఆకట్టుకునే పథకాలతో నేరస్థులు ఎత్తుగడలు వేస్తున్నారు. 2024లో ఆర్థిక, సైబర్ మోసాలతో రూ. 4వేల కోట్లు కొల్లగొట్టారు.
వీటి పేరుతో మోసాలు : బిజినెస్, కస్టమర్‌కేర్, ప్రకటనలు, డేటా చోరీ, డేటింగ్, బహుమతులు, హ్యాకింగ్, హనీట్రాప్, ఐడెంటిటీ దొంగతనం, గేమింగ్, ఇన్సూరెన్స్, ఇన్వెస్ట్మెంట్, జాబ్, లోన్, లాటరీ, మ్యాట్రిమోనియల్, ఓటీపీ, ఫిషింగ్, సిమ్, సోషల్ మీడియా, ట్రేడింగ్, వీసా, వాట్సాప్ డీపీ మోసాలు, డిజిటల్ అరెస్టులు, చిట్‌ఫండ్స్, ప్రీలాంచింగ్, కంపెనీల్లో పెట్టుబడులు, ఫిక్స్డ్ డిపాజిట్ల పేరుతో మోసాలు చేస్తున్నారు.
"గతంలో లాటరీ బహుమతుల పేరుతో మోసగించేవారు. ప్రస్తుతం క్రిస్మస్, నూతన సంవత్సరం వంటి పండగలను ఉపయోగించుకుంటున్నారు. ఆన్లైన్ ద్వారా బహుమతులు పంపుతామంటూ వివరాలు సేకరించి డబ్బులు కొట్టేస్తున్నారు కేటుగాళ్లు.బాధితులు మోసపోయినట్లు గ్రహించగానే వెంటనే 1930 టోల్‌ఫ్రీ నంబరుకు ఫిర్యాదు చేయాలి." -శిఖాగోయల్, డైరెక్టర్, టీజీసైబర్
సరికొత్తగా ‘మత్తు’ దందా: మరోవైపు 2023లో దాదాపు 14 వేల కిలోల గంజాయి పట్టుబడగా ఈ ఏడాది 6,400 కిలోల సరకు చిక్కడమే ఇందుకు ఉదాహరణ. మొత్తంగా హైదరాబాద్ నగరవ్యాప్తంగా దాదాపు రూ.250 కోట్ల విలువైన మత్తు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు.