No HMPV Cases in Telangana : తెలంగాణలో హెచ్ఎంపీవీ కేసులు లేవని ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ రవీందర్ నాయక్ శనివారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. చైనాలో హ్యూమన్ మెటానిమో వైరస్ (హెచ్ఎంపీవీ) కేసులు గణనీయంగా పెరుగుతున్నాయని వార్తలు వస్తున్న నేపథ్యంలో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ అప్రమత్తమైంది. ఈ క్రమంలో రాష్ట్రంలో హెచ్ఎంపీవీ కేసులపై మాట్లాడిన ఆయన, ఈ వైరస్ చలికాలంలో జలుబు, సాధారణ ఫ్లూ లక్షణాలు కలగజేస్తుందని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం వెల్లడించిందని అన్నారు. ఈ వైరస్‌పై భయాందోళనలు అక్కర్లేదన్నారు. కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ, ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్ననట్లు తెలిపారు.
మాస్క్ పెట్టుకోండి! - చైనా వైరస్ వ్యాప్తితో వైద్య ఆరోగ్య శాఖ హెచ్చరిక
జలుబు, ఫ్లూ లక్షణాలు కలిగి ఉన్నవారు తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. తుమ్ములు, దగ్గు వచ్చినప్పుడు చేతి రుమాలు లేదా టిష్యూ పేపర్‌ను అడ్డు పెట్టుకోవాలని, చేతులను తరచూ శుభ్రం చేసుకోవాలని చెప్పారు. జబ్బు చేసిన వారి దగ్గరకు వెళ్లడం, కళ్లు, ముక్కును తరచూ తాకడం, కరచాలనం చేయడం, బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయడం, వైద్యులను సంప్రదించకుండా మందులు వాడటం లాంటివి చేయకూడదని రవీందర్ నాయక్ తెలిపారు.
'కొత్త 'చైనా' వైరస్‌తో భయపడాల్సిన అవసరం లేదు- ఆ జాగ్రత్తలు తీసుకుంటే చాలు!'