Haritha Resort Rooms Booking Fraud : సైబర్ నేరగాళ్లు యథేచ్ఛగా మోసాలకు పాల్పడుతున్నారు. రోజుకో తరహాలో ఎత్తులు వేస్తూ ప్రజలను ఏమార్చుతున్నారు. సైబర్ నేరాలపై పోలీసులు ఎంత అవగాహన కల్పించినా బాధితుల సంఖ్య రోజురోజుకి పెరుగుతూనే ఉంది. ఓవైపు ఉద్యోగాలు, బహుమతులు అనే ఆశలను ఎరగా వేస్తున్నారు. మరోవైపు ప్రముఖుల సామాజిక మాధ్యమాల ఖాతాల డీపీలను ఉపయోగించి డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. కానీ వారు ఇప్పుడు రూట్ మార్చారు. ఏకంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రభుత్వ శాఖలకు సంబంధించిన వెబ్సైట్లను పోలిన ఫేక్ వెబ్‌సైట్స్‌ని సృష్టిస్తున్నారు. పొరపాటున ప్రజలు వాటిని ఆశ్రయిస్తే ఖాతాలు ఖాళీ చేసి మాయమవుతున్నారు.
బాపట్లకు సమీపంలోని సూర్యలంకలోని టూరిజం డిపార్ట్మెంట్ బీచ్ రిసార్ట్‌కి భారీగా డిమాండ్ ఉంది. దీనిని ఆసరాగా చేసుకుని కొంతమంది సైబర్ నేరస్థులు నకిలీ వెబ్‌సైట్‌లతో పర్యాటకులను మోసగిస్తున్నారు. తాజాగా ఓ ఘటన వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్‌లో పని చేస్తున్న ఓ ప్రైవేట్ ఉద్యోగి కుటుంబంతో కలిసి సెలవుల్లో సూర్యలంక బీచ్‌లో గడిపేందుకు ప్లాన్ చేసుకున్నాడు. ఈ క్రమంలో ముందస్తుగా గదుల బుకింగ్ కోసం ఆన్లైన్లో కనిపించిన వెబ్‌సైట్‌ను ఆశ్రయించాడు.
హరిత బీచ్ రిసార్ట్ పేరిట వెబ్సైట్లో ఉన్న ఫోన్ నంబర్‌కి ఆ ప్రైవేట్ ఉద్యోగి కాల్ చేశాడు. ఫోన్ ఎత్తిన సైబర్ నేరగాళ్లు రిస్టార్ట్ మేనేజర్ సంజయ్గుప్తాగా పరిచయం చేసుకున్నారు. గదుల బుకింగ్ కోసం నగదు బదిలీ చేయాల్సిన ఖాతా వివరాలను ఆయనకు వాట్సప్ చేశాడు. ఇక్కడే బ్యాంకింగ్ సిస్టంలో ఉన్న లోసుగులను సైబర్ నేరస్థులు అవకాశంగా మల్చుకున్నారు. సహజంగా ప్రైవేట్ బ్యాంకు ఖాతాలకు ఏ బ్రాంచ్ ఐఎఫ్ఎస్సీ కోడ్ ద్వారా అయినా నగదు బదిలీ చేసే అవకాశం ఉంది.
Cyber Cases in AP :వెంటనే రెండు గదుల బుకింగ్ కోసం పంపించిన ఆ నంబర్‌కి బాధితుడు నగదు బదిలీ చేశాడు. ఇక్కడే సైబర్ నేరగాళ్లు మరో ఎత్తుగడకు తెర తీశారు. సొమ్ము బదిలీ కాలేదని, ఇంకోసారి చెల్లింపు చేయాలని కోరారు. పేమెంట్ సక్సెస్ అయినట్లు తనకు మెసేజ్ రావడంతో ఆయనకి అనుమానం వచ్చింది. పూర్తి వివరాలు వారిని అడగ్గా పొంతన లేని సమాధానాలు చెప్పారు. ఈ క్రమలో తాను సైబర్ మోసానికి గురైనట్లు ఆ ఉద్యోగి గ్రహించాడు.