KTR ED Investigation : ఫార్ములా-ఈ కార్ రేస్ కేసులో బీఆర్ఎస్ కార్యనిర్వహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ ఈడీ విచారణ ముగిసింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇచ్చిన నోటీసుల్లో పేర్కొన్నట్టు ఉదయం పదిన్నరకు ఆయన ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. దాదాపు 7 గంటల పాటు అధికారులు ఆయణ్ని ప్రశ్నించారు. హెచ్‌ఎండీఏ ఖాతా నుంచి విదేశీ సంస్థకు నిధుల బదిలీపై అధికారులు ఆరా తీసినట్టు తెలుస్తోంది.
ఈ-రేస్ నిర్వహణ కోసం యూకేలోని ఫార్ములా-ఈ ఆర్గనైజేషన్స్‌కు నగదు బదిలీ చేయడంలో ఫెమా, ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్ ఉల్లంఘన జరిగిందన్న కోణంలో కేటీఆర్ నుంచి అధికారులు వివరాలు సేకరించినట్లు సమాచారం. విదేశీ సంస్థకు రూ.45.7 కోట్ల బదిలీ వ్యవహారంపై ప్రధానంగా ఆయణ్ని ప్రశ్నించినట్టు తెలుస్తోంది. ఈ కేసులో ఇప్పటికే అర్వింద్‌కుమార్, బీఎల్‌ఎన్ రెడ్డి ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా ఈడీ అధికారులు విచారించారు. ఫార్ములా-ఈరేస్‌లో నిబంధనల ఉల్లంఘనపై ఏసీబీ దర్యాప్తు చేస్తుండగా ఇందులో ఆర్బీఐ అనుమతి లేకుండా విదేశీ సంస్థకు నిధుల చెల్లింపుపై ఈడీ మరో కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.
Formula E Car Race Case : ఈడీ కార్యాలయం నుంచి బయటకు వచ్చిన కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ఏ తప్పు చేయకున్నా చట్టాలను గౌరవించే పౌరుడిగా విచారణకు వచ్చినట్లు తెలిపారు. ఒక్క రూపాయి అవినీతి చేయకున్నా విచారణకు హాజరయ్యానని పేర్కొన్నారు. ఏసీబీ మాదిరిగానే ఈడీ కూడా అవే ప్రశ్నలు అడిగారని వివరించారు. అడిగిన ప్రశ్నలనే తిప్పితిప్పి అడిగారని, విచారణకు ఎన్నిసార్లు పిలిచినా వస్తానని వారికి చెప్పానని కేటీఆర్ వివరించారు.
'రేవంత్‌పై ఏసీబీ, ఈడీ కేసులున్నాయని నాపైనా పెట్టించారు. రేవంత్‌రెడ్డికి సవాల్ విసురుతున్నా. జడ్జి ముందు లైవ్‌లో విచారణకు సిద్ధం. జనం చూస్తుండగా టీవీ లైవ్‌లో విచారణకు సిద్ధం. లైడిటెక్టర్ పరీక్షకు నేను సిద్ధం రేవంత్‌రెడ్డి సిద్ధమా?. కోర్టులు, జడ్జిలపై నమ్మకం ఉంది న్యాయమే గెలుస్తుంది. తప్పు చేయలేదు తప్పు చేయబోను. తప్పు రుజువు చేస్తే ఏ శిక్షకైనా సిద్ధమని చెప్పా' అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
"రేవంత్‌పై ఏసీబీ, ఈడీ కేసులున్నాయని నాపైనా పెట్టించారు. రేవంత్‌రెడ్డికి సంక్రాంతి ఆఫర్ ఇస్తున్నా. రేవంత్ ఇద్దరం లై డిటెక్టర్ పరీక్షలు చేయించుకుందాం. లైవ్‌లో లైడిటెక్టర్ పరీక్షలకు నేను సిద్ధం. లైడిటెక్టర్ పరీక్షల తేదీ, సమయం, స్థలం రేవంత్‌రెడ్డి ఇష్టం." - కేటీఆర్, బీఆర్ఎస్ మాజీ మంత్రి
ఈడీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత : మరోవైపు కేటీఆర్ విచారణ నేపథ్యంలో ఎన్ఫోర్స్మెంట్ కార్యాలయానికి పెద్దసంఖ్యలో బీఆర్ఎస్ శ్రేణులు చేరుకున్నారు. వారిని పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట చోటుచేసుకుంది. సుమారు 200 మంది పోలీసులు అక్కడ మోహరించారు. బాష్పవాయువు, వాటర్‌కెనాన్ల వాహనాలను పోలీసులు తెప్పించారు. ఈ క్రమంలోనే పలువురు బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలించారు.
'అందుకే ఫైలుపై సంతకం పెట్టా' - కీలక విషయాలు వెల్లడించిన కేటీఆర్