తెలంగాణ

telangana

ETV Bharat / state

నమ్మకమైన ఖాతాదారుడి పేరుతో వాట్సాప్​లో చెక్కు - అడ్డంగా దొరికిపోయిన SBI బ్యాంక్ మేనేజర్ - CYBER CRIME IN SBI BANK IN AP

బ్యాంకు అధికారులనే బోల్తా కొట్టించిన సైబర్ నేరగాళ్లు - నైస్‌గా రూ.9.5 లక్షలు మాయం

Cyber Criminals Cheated SBI Manager and Show Room Managaer in AP
Cyber Criminals Cheated SBI Manager and Show Room Managaer in AP (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Dec 22, 2024, 7:00 PM IST

Updated : Dec 22, 2024, 7:06 PM IST

Cyber Criminals Cheated SBI Manager and Show Room Managaer in AP : సైబర్‌ మోసాలకు గురి కావొద్దంటూ పదే పదే హెచ్చరించే బ్యాంకు సిబ్బందినే బోల్తా కొట్టించారు మాయగాళ్లు. నమ్మకమైన ఖాతాదారుడి పేరుతో ఫోన్‌ చేసి, బ్యాంకు చెక్కును వాట్సాప్‌లో ఫొటో పెట్టి, రూ.9.5 లక్షల నగదును బదిలీ చేయించుకున్నారు. ఆంధ్రప్రదేశ్​ అనంతపురంలోని రాంనగర్‌ ఎస్‌బీఐలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అనంతపురం ఎస్బీఐ మేనేజర్‌ సైబర్‌ క్రైం మోసగాళ్ల చేతిలో చిక్కి నగదు బదిలీ చేసిన ఘటన సంచలనంగా మారింది. తాను హోండా షోరూం ఎండీ కవినాథ రెడ్డినని, వాట్సాప్‌లో చెక్‌ పెట్టానని, వెంటనే దిల్లిలోని బ్యాంకు ఖాతాకు రూ.9.5 లక్షలు జమ చేయాలని చెప్పాడు.

నిజమేనని నమ్మిన బ్యాంకు మేనేజర్‌ నగదు బదిలీ చేశారు. ధన్వి హోండా షోరూం ఖాతా నుంచి రూ.9.5 లక్షలు డెబిట్‌ చేసిన మెసేజ్‌ రాగానే కంగుతున్న షోరూం మేనేజర్‌ పరుగున ఎస్బీఐకి వచ్చారు. ఈలోపు దిల్లీలోని సైబర్‌ నేరగాళ్ల ఖాతాకు చేరిన రూ.9.5 లక్షలు విత్‌ డ్రా చేసేసి, ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ చేసేశారు. అలా మేనేజర్‌ తప్పిదంతో సైబర్‌ నేరగాళ్లు సొమ్ము కాజేశారు.

ఏపీలోని అనంతపురం రాంనగర్‌లోని ధన్వి హోండా బైక్‌ షోరూంనకు 10వ తేదీన ఓ వ్యక్తి ఫోన్‌ చేసి, తనను జొమాటో మేనేజర్‌గా పరిచయం చేసుకున్నాడు. తమ సిబ్బంది ఫుడ్‌ డెలివరీ ఇవ్వడానికి పది బైక్‌లు కొనాలని అనుకున్నట్లు చెప్పి, కొటేషన్ ఇవ్వాలని అడిగారు. జొమాటో పేరు మీద కొటేషన్‌తో పాటు క్యాన్సిల్డ్‌ చెక్‌ను పంపించాలని సైబర్‌ నేరగాడు చెప్పాడు. వారు చెప్పినట్టుగానే పది బైక్‌లకు ఆర్డర్‌ వచ్చిందన్న సంతోషంలో షోరూం మేనేజర్‌ లెటర్‌ హెడ్​లో పది బైక్‌ల ధర, ఇతర పన్నుల వివరాలను, క్యాన్సిల్‌ చేసిన చెక్కును ఫొటో తీసి జొమాటో మేనేజర్‌గా పరిచయం చేసుకున్న సైబర్‌ నేరగాడికి పంపించాడు.

ఎండీ అంటూ మోసం చేసి :షోరూం నుంచి వెళ్లిన క్యాన్సిల్డ్‌ చెక్కులో షోరూం యజమాని సంతకం అలాగే ఉంచి, అడ్డంగా కొట్టిన గీతలను ఫొటో షాప్‌ ఉపయోగించి వాటిని తీసేసాడు. సంతకం చేసిన ఖాళీ చెక్కుగా మార్చేశాడు. ఇక బైక్‌ ధరల వివరాలతో పంపిన కొటేషన్‌ లెటర్ హెడ్‌లో వివరాలను పూర్తిగా చెరిపేశారు. తరువాత రాంనగర్‌ స్టేట్‌ బ్యాంక్‌ మేనేజర్‌ పేరును అభ్యర్థిస్తూ లెటర్‌ హెడ్‌లో మ్యాటర్‌ను టైప్‌ చేశారు. ఖాళీ చెక్కుతో పాటు, నగదు బదిలీ చేయాలని ఫేక్ లెటర్ హెడ్​లను ఎస్బీఐ మేనేజర్ అంబ్రీశ్వర స్వామికి పంపించారు. దాంతో పాటు హోండా షోరూం ఎండీ కవినాథరెడ్డి పేరుతో ఫోన్‌ చేసి నమ్మబలికారు. తాను ధన్వి షోరూం ఎండీనని, తన ఫోన్​లో ఛార్జింగ్ అయిపోవడంతో మరో ఫోన్​తో మాట్లాడుతున్నట్లు మాయమాటలు చెప్పాడు.

అన్ని సమకూర్చుకున్న నేరగాడు ప్లాన్‌ మొదలు పెట్టాడు. తన తల్లికి బాగోలేదని, దిల్లీలో ఆసుపత్రిలో చేర్చానని, తమ షోరూం చెక్కును వాట్సాప్ చేసినట్లు తెలిపాడు. అతను అనంతరపురం వచ్చిన వెంటనే పంపించిన లెటర్‌ హెడ్‌, చెక్‌ల ఆధారంగా దిల్లీలోని బ్యాంకు ఖాతాకు రూ.9.5 లక్షలు బదిలీ చేశాడు. షోరూం బ్యాంకు ఖాతా నుంచి నగదు బదిలీ కాగానే, షోరూం మేనేజర్‌ మొబైల్‌కు మెసేజ్‌ వెళ్లింది. దీంతో మేనేజర్‌ కంగుతిన్నాడు. షోరూం ఖాతా నుంచి డెబిట్ కావడంతో బైక్‌ షోరూం మేనేజర్ వెంటనే రాంనగర్‌ స్టేట్‌ బ్యాంకు మేనేజరు దగ్గరకు వచ్చారు. తాము చెక్కు ఇవ్వలేదని, క్యాన్సిల్డ్‌ చెక్‌ను మార్ఫింగ్‌ చేసి మోసం చేశారని బ్యాంకు మేనేజర్‌ అంబ్రీశ్వరస్వామికి చెప్పారు. తనకు ఫోన్‌ చేసిన సైబర్‌ మోసగానికి బ్యాంకు మేనేజర్‌ ఫోన్‌ చేయగా, తాను ఎండీనేనని సమాధానం చెప్పి ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ చేశాడు.

కానీ దిల్లీ ఖాతాకు వెళ్లిన వెంటనే నగదును విత్‌డ్రా చేశారు. ఈ ఘటన ఈ ఏడాది సెప్టెంబర్‌లో జరగ్గా, బ్యాంకు మేనేజరు దిల్లీ వరకు వెళ్లి విచారించినప్పటికీ ఎలాంటి ఆధారాలు దొరక్కపోగా, ఎఫ్‌ఐఆర్‌ కూడా లేకపోవడంతో దిల్లీ పోలీసులు కనీసం సహకరించలేదు. దీంతో అన్ని ప్రయత్నాలు చేసి తిరిగొచ్చిన బ్యాంకు మేనేజర్‌ అంబ్రీశ్వరస్వామి, అనంతపురం నాల్గో పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో ఈ నెల 14వ తేదీన ఫిర్యాదు చేశారు.

Last Updated : Dec 22, 2024, 7:06 PM IST

ABOUT THE AUTHOR

...view details