Cyber Crime Police Recovered Money In Hyderabad: సైబర్ నేరగాళ్ల దాడుల్లో ఒకసారి వారి చేతుల్లోకి వెళ్లిన సొమ్ము తిరిగి బాధితుని వద్దకు రావడమంటే ఏదో అద్భుతమే జరగాలి. ఇలా చాలా మంది అనేక రకాల సైబర్ దాడుల్లో కోట్ల రూపాయల సొమ్మునే పోగొట్టుకున్నారు. ఇలా సైబర్ మోసాలు ఈ ఆధునిక సమాజంలో రోజురోజుకీ పెరిగిపోతున్నారు. ఇన్నాళ్లు ఇలాంటి వారిని గుర్తించడం కఠినంగానే ఉండేది కానీ వారితో పాటు పోలీసులు కూడా కొత్త పంథాలను ఎంచుకోవడంతో ఇలాంటి దాడులకు పాల్పడేవారిని గుర్తించి వారి నుంచి సొమ్మును దాదాపుగా రికవరీ చేస్తున్నారు.
తాజాగా హైదరాబాద్‌లోని నేరేడ్మెట్లో ఓ వ్యక్తి సైబర్ నేరగాళ్ల వలలో చిక్కి రూ. 1,26,752 పోగుట్టుకున్న డబ్బును సైబర్ క్రైం పోలీసులు రికవరీ చేసి అప్పగించారు. నేరేడ్మెట్ గీతానగర్‌లో నివాసం ఉంటున్న అభిషేక్ అనే వ్యక్తి మూడు నెలల క్రితం సైబర్ నేరగాళ్లు పంపిన లింకులో తన వివరాలు నమోదు చేసుకున్నాడు. టాస్క్ కంప్లీట్ చేస్తే డబ్బులు వస్తాయని సైబర్‌నేరగాళ్లు నమ్మించారు.
దీంతో డబ్బు వస్తుందని ఆశపడిన ఆ వ్యక్తి ముందుగా తన ఖాతా నుంచి కొద్దికొద్దిగా డబ్బులు పంపించాడు. మళ్లీ సైబర్ నేరగాళ్లు డబ్బులు డిమాండ్ చేయడంతో మోసపోయానని తెలుసుకున్న ఆ వ్యక్తి 1930కి డయల్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై నేరేడ్మెట్ పోలీసులు కేసు నమోదు చేసుకొని ముందుగా నిందితుల బ్యాంక్ ఖాతాలను నిలుపుదల చేయించారు. అనంతరం బాధితుడు పోగొట్టుకున్న డబ్బు వివరాలు తెలుసుకొని అతనికి అందేలా చేశారు.