A Doctor in Trap Of Cyber Criminals :జగిత్యాల జిల్లా మెట్పల్లిలో ఓ పిల్లల వైద్యుడు సైబర్ నేరగాళ్ల వలలో పడి నిలువు దోపిడికి గురైన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేద్దామన్న ఆశతో ఏకంగా రూ.74 లక్షలకు పైగా పోగొట్టుకొని తలపట్టుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం, సోషల్ మీడియా యాప్‌లో అనాధికార ఓ సైట్ లింకును డాక్టర్ ఓపెన్ చేశాడు.
ఇంతలో అవతలి వైపు నుంచి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఏసీ మాక్స్ అనే అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని యాక్సిల్ స్టూడెంట్ సీ 95 గ్రూపులో చేరండంటూ ఒక లింకు వాట్సాప్‌కు వచ్చింది. ఆ లింకును ఓపెన్ చేసి ఇన్వెస్ట్ చేయడం ప్రారంభించాడు. విడతల వారీగా మొత్తం రూ.22 లక్షలు పెట్టుబడి పెట్టాడు. తర్వాత ఐపీఓ సబ్‌స్క్రైబ్ చేసుకోవాలని వాట్సప్ కాల్ రావడంతో తన దగ్గర డబ్బులు లేవని బదులిచ్చాడు.
అప్పు చేసి రూ.50 లక్షలు చెల్లించి :జమ చేసిన డబ్బులు సరిపోతాయని నమ్మించడంతో సదురు వైద్యుడు ఐపీఓ సబ్‌స్క్రైబ్ చేశాడు. ఆ వెంటనే రూ.50 లక్షలు కట్టాలని లేదంటే క్రెడిట్ స్కోర్ పడిపోతుందని, లైఫ్ రిస్క్‌లో పడుతుందని కాలర్ చెప్పడంతో తన వద్దనున్న డబ్బులతో పాటు అప్పు చేసి రూ.50 లక్షలు చెల్లించాడు. జూన్ 26న ఐపీఓలో పెట్టిన పెట్టుబడి లాభం రూ. కోటి 27 లక్షలకు పెరిగిందని మళ్లీ ఇంకో ఐపీఓ సబ్‌స్క్రైబ్ చేసుకోవాలని వాట్సప్ కాల్ వచ్చింది.