Current Real Estate Market In Hyderabad : హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ పునాదులు బలంగా ఉన్నా, సెంటిమెంటే బలహీనంగా ఉందని రియల్ ఎస్టేట్ నిపుణులు అంటున్నారు. ప్రతికూల మార్కెట్ సెంటిమెంట్ కారణంగా పెట్టుబడులు పెట్టడం అనిశ్చితిగా భావించాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. తెలివైన పెట్టుబడిదారులు దీన్ని సువర్ణ అవకాశంగా మలుచుకుంటారని అంటున్నారు.
దేశంలోని ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌కు మౌలిక వసతుల పరంగా ఎన్నో సానుకూలతలు ఉన్నాయి. రానున్న రోజుల్లో కొత్తగా మరిన్ని మౌలిక వసతులు రాబోతున్నాయి. ఫలితంగా నగరం నలువైపులా విస్తరించేందుకు అవకాశం ఎక్కువ. ఆర్ఆర్ఆర్ వరకు నగరం కలిసిపోతుంది. ఇతర నగరాలతో పోలీస్తే హైదరాబాద్‌లో నీటి సమస్యలు తక్కువే. కృష్ణా, గోదావరి జలాలను తరలిస్తున్నారు. నగరానికి మణిహారంగా ఓఆర్‌ఆర్ ఉంది. మెట్రో విస్తరణ ప్రణాళికలను ప్రభుత్వం ఇదివరకే ప్రకటించింది. ఈ మౌలిక వసతులన్నీ భవిష్యత్తులో నగరంలో సమకూరుతాయి. రియల్ ఎస్టేట్ మార్కెట్‌కు ఇవి బలమైన పునాదులుగా పని చేస్తున్నాయి.
వృద్ధి తప్పకుండా ఉంటుంది - పెట్టుబడి పెట్టొచ్చు :ఇంటి అవసరం ఉన్నవారు మార్కెట్‌తో సంబంధం లేకుండా కొనుగోళ్లు చేస్తున్నారు. మిగులు నిధులు ఉన్నవారు స్థిరాస్తిలో పెట్టుబడులు పెడుతున్నారు. ఆస్తి విలువ పెరుగుతుందనే భరోసాతో ఉన్నారు. ఇటీవల పరిణామాల కారణంగా కొంతమంది మాత్రం వేచిచూసే ధోరణిలో ఉన్నారు. చేతిలో మిగులు సొమ్ములు ఉంటే వృద్ధి అవకాశం ఉన్న ప్రాంతాల్లో ఆస్తి కొనుగోలు చేయడానికి ఇది సరైన సమయం అని నిపుణులు సూచిస్తున్నారు. కొనడానికి ఆసక్తి ఉన్నవారు వస్తే భూ యజమానులు, రియల్టర్లు సైతం ధరలను తగ్గించడానికి సిద్ధంగా ఉన్నారు. ఒక్కసారిగా పెరిగిన ధరలు కాకుండా వాస్తవిక ధరలకు ఇచ్చేందుకు రియల్టర్లు సుముఖంగా ఉంటున్నారని తెలిపారు.
లెక్క మారింది - 'తెలంగాణలో ఒక ఎకరం అమ్మితే ఏపీలో 100 ఎకరాలు కొనొచ్చు' - Land Prices Increased In Telangana
విలువ పెరగటం ఖాయం :వేర్వేరు కారణాలతో మార్కెట్ సెంటిమెంట్‌పై కొంత ప్రతికూల ప్రభావం ఉంటోంది. ప్రభుత్వం తమ విధానాలను స్పష్టం చేయడం, వడ్డీరేట్లు తగ్గడం, ప్రపంచ పరిణామాల్లో మార్పులు వంటి వాటిపై ఆధారపడి ఎప్పుడైనా పుంజుకునే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. స్థిరాస్తి విలువ పెరగడం ఖాయమని చెబుతున్నారు. ఆ సమయం ఎప్పుడు అనేది చెప్పలేరు కాబట్టి అందుకు సిద్ధంగా ఉండాలని చెబుతున్నారు. పెరిగితే ఒనగూరే రాబడులను అందుకోవాలంటే ముందు నుంచే అనువైన స్థిరాస్తుల అన్వేషణ మొదలు పెట్టాలని వారు సూచిస్తున్నారు. దీంతో బేరమాడి మంచి ధరలకు స్థిరాస్తిని కొనుగోలు చేయవచ్చు.
"మార్కెట్ సెంటిమెంట్‌పై ఆధారపడి రియల్ ఎస్టేట్ వ్యాపారం సాగుతుంది. కొత్త ప్రభుత్వం వచ్చాక విధానపరమైన నిర్ణయాల్లో స్పష్టత కోసం వేచిచూసే ధోరణిలో మార్కెట్ ఎదురుచూసింది. ఇందులో నుంచి తేరుకునేలోపు హైడ్రా కూల్చివేతలతో కొనుగోలుదారులు ఆయోమయంలో పడ్డారు. వేచిచూసే ధోరణిలో ఉన్నారు. హైదరాబాద్ మార్కెట్ పునాదులు గట్టివి కాబట్టి సర్కారు తమ విధానాలను ప్రకటిస్తే మళ్లీ పెరగడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మరో సమస్య కూడా మార్కెట్లో ఉంది. అందుబాటు ధరల్లో ఇళ్ల లభ్యత తగ్గతూ వస్తోంది. ఆదాయం వార్షికంగా 10 శాతం పెరిగితే ఇంటి ధర అంతకు అయిదు రెట్లు పెరగడంతో కొనలేకపోతున్నారు. ఇది కూడా కొనుగోళ్లు మందగించడానికి ఒక కారణం. ఇలాంటి పరిస్థితుల్లో అప్పు చేసి పెట్టుబడులు పెట్టడం రిస్కే. నగదు ఉంటే మాత్రం వేచి చూడకుండా అనువైన స్థిరాస్తిని దీర్ఘకాల అవసరాల కోసం కొనుగోలు చేయవచ్చు." - సుమంత్ రెడ్డి, నేషనల్ అసోసియేషన్ ఆఫ్ రియల్ట్ ఇండియా ఛైర్మన్
మార్కెట్ పెరుగుతున్నప్పుడు హడావుడిలో మోసపోవడానికి అవకాశం ఉంటుందని, ఇప్పుడు తగినంత సమయం ఉందని చెబుతున్నారు. స్థిరాస్తులను ఎంపిక చేసుకునేటప్పుడు టైటిల్‌పై వివాదాలు లేకుండా చూసుకోవాలంటున్నారు. చెరువుల సమీపంలో, ప్రభుత్వ భూముల పక్కన ఉండే స్థలాల కొనుగోళ్లలో మరింత అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
హైదరాబాద్‌లో రియల్ భూమ్ - ధరలు పెరగకముందే ఈ ప్రాంతాల్లో కొనుగోలు బెస్ట్ - Real Estate in Hyderbad
అక్కడ గజం రూ.లక్ష - అయినా అందరి చూపూ అటు వైపే - Real Estate Business in Hyderabad