Ganja Cultivation in AP : అడవి మధ్యలో సాగు చేస్తే ఎవరూ గుర్తించలేరనుకున్నారు. అంతదూరం వచ్చి చూసేవారెవరు, వచ్చినా అడవిలో గుర్తించడం కష్టం అనుకున్నారు. కానీ ఏపీ పోలీసులు ఈ గంజాయి సాగుదారులకు ఝలక్ ఇచ్చారు. డ్రోన్ల సాయంతో గంజాయి పెంపకం దారుల ఆట కట్టించారు. ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లా జి.మాడుగుల మండలం సొలభం పంచాయతీలో గల డేగలరాయి అటవీ ప్రాంతం. అనుమానం వచ్చి ఈ ఏరియాలో డ్రోన్ సర్వే చేయించారు. అడవి మధ్యలో 5 ఎకరాల్లో విరగగాసిన గంజాయి మొక్కలు కనిపించాయి. వెంటనే జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్‌కు సమాచారమిచ్చారు. స్వయంగా ఆ ప్రాంతానికి వెళ్లి తనిఖీ చేసిన ఎస్పీ మొత్తం పంటను తగలబెట్టాలని ఆదేశించారు.
గంజాయి మొక్కల దహనం : సుమారు 5 ఎకరాల్లో సాగు చేస్తున్న దాదాపు 1,000 గంజాయి మొక్కలను డ్రోన్ సాయంతో గుర్తించారు. ఎస్పీ ఆదేశం మేరకు పోలీసులు, రెవెన్యూ, అటవీ అధికారులు గంజాయి మొక్కలను పీకేసి దహనం చేశారు. సాగుదారుల వివరాలు సేకరించాలని ఎస్పీ అమిత్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. అటవీ ప్రాంతంలో గంజాయి మొక్కలను సాగు చేస్తే ఎవరికి తెలియదనుకొని నిందితులు ఈ చర్యకు పాల్పడ్డారు.
ఎస్పీ మాట్లాడుతూ గతంలో డ్రోన్‌తో వెతికినా చిన్న చిన్న మొక్కలు కావడం వల్ల కనపడలేదని అన్నారు. ప్రస్తుతం రెండు అడుగుల పైబడి పెరిగి ఉండడంతో ఇప్పుడు డ్రోన్‌కి కనిపించాయని చెప్పారు. ప్రభుత్వం తరఫున ప్రత్యామ్నాయంగా పండ్లు, పూల మొక్కలు ఈ ప్రాంతంలో పంపిణీ చేశామని, అయినా చెడుదారి పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గంజాయి మొక్కల సాగుపై శిక్షలు కఠినంగా ఉంటాయని హెచ్చరించారు. ప్రభుత్వం పంపిణీ చేస్తున్న 25 రకరకాల పంట మొక్కల్ని సాగు చేసుకోవాలని సూచించారు.