తెలంగాణ

telangana

ETV Bharat / state

కాళేశ్వరం బ్యారేజీలలో సీపేజీ - అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని నిపుణుల కమిటీ సూచన - MEDIGADDA BARRAGE DAMAGE REPAIRS UPDATES

Medigadda Barrage Damage Repair : కాళేశ్వరం బ్యారేజీలలో సీపేజీ​ను గుర్తించామని వెంటనే వాటిని పూడ్చాలని న్యాయ కమిషన్ నిపుణుల కమిటీ సూచించింది. బ్యారేజీ దిగువన రాఫ్ట్​ పునాదుల వద్ద దీన్ని గుర్తించామని తెలిపింది. అలాగే మేడిగడ్డ బ్యారేజీని సీఎస్​ఎంఆర్ఎస్​​ బృందం పరిశీలించింది. దెబ్బతిన్న ఏడో బ్లాక్​ పరిధిలో 25 అడుగుల మేర డ్రిల్లింగ్​ చేసి అందులో నమూనాలను సేకరించింది.

Madigadda Barrage Damage Issue
Madigadda Barrage Damage Issue (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jun 6, 2024, 8:12 AM IST

Updated : Jun 6, 2024, 8:21 AM IST

Kaleshwaram Project Damage Repairs Update : మేడిగడ్డ కుంగిన సంఘటనతో పాటు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను పరిశీలించేందుకు గత నెల 22న న్యాయ కమిషన్​కు సహాయపడే నీటిపారుదల శాఖ నిపుణుల కమిటీని నియమించింది. వరంగల్​ ఎన్​ఐటీ ప్రొఫెసర్​ రమణమూర్తితో కూడిన బృందం ఈ మూడు బ్యారేజీలను పరిశీలించింది. బ్యారేజీలలో దిగువ భాగాన రాఫ్ట్​ పునాదుల వద్ద సీపేజీని గుర్తించామని తెలిపింది. దానిని అరికట్టడానికి ఇసుక, సిమెంటును వినియోగించి చర్యలు తీసుకోవాలని సూచించింది. ఈ కమిటీ ఈనెల 1న బ్యారేజీని సందర్శించింది. ఈ కమిటీ సూచించిన సిఫార్సుల ప్రకారం చర్యలు తీసుకోవాలని సంబంధిత ఇంజినీర్లకు ఈన్సీ సూచించారు. కొన్ని పనులు వేగంగా చేయాలని కమిటీ సూచించడం చర్చనీయాంశం అయింది.

చర్చనీయాంశమైన అంశాల వివరాలు :

  • సీసీ బ్లాక్​ల కింద రాఫ్ట్​ పునాదుల వద్ద సీపేజీ ఉంది. మూడు బ్యారేజీలలోనూ ఈ సమస్య సామాన్యంగా ఉంది. ఇసుక, సిమెంటు కలిపి సీపేజీని అరికట్టాలి.
  • మూడు బ్యారేజీలలోనూ దిగువ వైపు ఆప్రాన్​ దెబ్బతింది. పక్కకు వెళ్లిపోయిన బ్లాక్​లను వెంటనే అమర్చే పనిని పూర్తి చేయాలని నిర్మాణ సంస్థలకు సూచించాలి.
  • మేడిగడ్డలో ఏడవ బ్లాక్​ వద్ద పడిన బుంగలు పూడ్చే కార్యక్రమం కొనసాగుతోంది. కాంక్రీట్​ లేదా ఎపాక్సీ కోటింగ్​తో బీటలను పూడ్చాలి. రాఫ్ట్​ దిగువన ఉన్న స్థలంలోకి నీరు నేరుగా ప్రవేశించకుండా చర్యలు తీసుకోవాలి. ఇందుకోసం సీకెంట్‌ పైల్స్, రాఫ్ట్‌ స్లాబ్‌ బ్యారేజీ ఎగువన, దిగువన సీల్‌ చేయాలి.
  • బ్యారేజీలకు ఎగువన సీకెంట్‌పైల్‌ పొడవునా సిమెంట్, బెనోటైన్‌ మిక్స్‌తో గ్రౌటింగ్‌ చేయాలి. సీకెంట్‌పైల్‌కు మూడు మీటర్ల దూరంలో ఇసుకబెడ్‌ వద్ద ఈ మిక్సింగ్‌తో గ్రౌటింగ్‌ చేయాలి.
  • గ్రౌటింగ్​ పని పూర్తయిన వెంటనే బ్యారేజీ రాఫ్ట్​ మీద డ్రిల్లింగ్​ కోసం వేసిన రంధ్రాలను పూడ్చివేయాలి.
  • గేట్లు ఎత్తేందుకు ప్రాధాన్యం ఇవ్వాలి. గేట్లు ఎత్తే మెకానిజాన్ని అన్ని రకాలుగా సిద్ధం చేసుకోవాలి.
  • మోడల్​ స్టడీస్​కు తగ్గట్లుగా బ్లాక్​ల వారీగా గేట్ల నిర్వహణకు స్కాడా కార్యక్రమాన్ని రూపొందించుకోవాలి.
  • మోడల్​ స్టడీస్​కు తగ్గట్లుగా బ్యారేజీల ఎగువన, దిగువన నీటి ప్రవాహానికి ఉన్న అడ్డంకులను తొలగించాలి.
  • అన్నారం, సుందిళ్ల బ్యారేజీలలో పునరుద్ధరణ పనులు నెమ్మదిగా జరుగుతున్నాయి. వాటి వేగాన్ని పెంచాలి. వర్షాలు వచ్చేలోగా అన్ని పనులు పూర్తి చేయాలి.

మేడిగడ్డలో సీఎస్‌ఎమ్‌ఆర్‌ఎస్‌ బృందం పరీక్షలు : మేడిగడ్డ బ్యారేజీలో దెబ్బతిన్న ఏడో బ్లాక్​ పరిధిలో దిల్లీకి చెందిన సెంట్రల్​ సాయిల్​ మెటీరియల్​ రీసెర్చి స్టేషన్​ నిపుణుల బృందం పరీక్షలు చేసింది. ఈ నివేదికను ఎన్డీఎస్​ఏకు ఇవ్వనుంది. నేషనల్​ డ్యాం సేఫ్టీ అథారిటీ కమిటీ సూచనల మేరకు పరీక్షలు చేసి నివేదిక ఇవ్వనున్నారు. ఈ కమిటీ రిపోర్టు ఆధారంగానే తాత్కాలిక, శాశ్వత మరమ్మత్తులు చేపడతారు. కొన్ని పరీక్షలను అక్కడికక్కడే చేస్తుండగా మరికొన్ని నమూనాలను సేకరించారు. దెబ్బతిన్న ఏడో బ్లాక్​ పరిధిలో 25 అడుగుల మేర డ్రిల్లింగ్​ చేసి అందులో నమూనాలను సేకరించింది. అలాగే పియర్స్​కు డ్రిల్​ చేసి కూడా పరీక్షించారు. ఈ బృందం జియో టెక్నికల్, కాంక్రీట్‌ పరీక్షలు, జియో ఫిజికల్​ పరీక్షలను వారం రోజుల పాటు నిర్వహించనుంది.

మేడిగడ్డ బ్యారేజీలో సీఎస్‌ఎంఆర్‌ఎస్‌ సంస్థ పరీక్షలు - మెటీరియల్, మట్టి నమునాలు సేకరణ

మేడిగడ్డ బ్యారేజీకి నష్టంపై అంచనా - ఇన్వెస్టిగేషన్లకు పట్టనున్న మరింత సమయం - Medigadda Investigation Delay

Last Updated : Jun 6, 2024, 8:21 AM IST

ABOUT THE AUTHOR

...view details