CS Shanthi Kumari Teleconference With Collectors on Rains :రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశించారు. వర్షాలు, వరదల ప్రభావం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జిల్లా కలెక్టర్లతో సీఎస్ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.
తెలంగాణతో పాటు సరిహద్దు రాష్ట్రాల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నందున ఎలాంటి పరిస్థితి ఎదురైనా సమర్థంగా ఎదుర్కొననేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. సచివాలయం, కలెక్టర్ల కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్లు తెరవాలని సీఎస్ ఆదేశించారు. ఉద్ధృతంగా పారే వాగుల వద్ద ఒక అధికారిని ప్రత్యేకంగా నియమించి పర్యవేక్షించాలని శాంతికుమారి చెప్పారు. పాఠశాలలకు సెలవులపై జిల్లాలో పరిస్థితిని పరిశీలించి కలెక్టర్లే నిర్ణయం తీసుకోవాలని సీఎస్ తెలిపారు.
అంటు వ్యాధులు వ్యాపించకుండా చర్యలు :వరద ప్రభావం తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో పునరావాస కేంద్రాల ఏర్పాటుపై ముందస్తు ప్రణాళిక రూపొందించుకోవాలని సీఎస్ సూచించారు. మంచినీటి ట్యాంకులు కలుషితం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. అంటువ్యాధులు ప్రబలకుండా బ్లీచింగ్ పౌడర్, క్లోరినేషన్ చేపట్టాలని సీఎస్ ఆదేశించారు. వైద్య బృందాలను అప్రమత్తం చేశామని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో మందులను సిద్ధంగా ఉంచామని శాంతి కుమారి వెల్లడించారు.
వాయుగుండం ప్రభావంతో తెలంగాణలో వానలే వానలు - పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ - Heavy Rain Alert To Telangana
పరివాహక ప్రాంతాల్లో అధికారుల నిఘా :ముందస్తు సమాచారం ఇస్తే హైదరాబాద్, విజయవాడ నుంచి ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కూడా పంపిస్తామని సీఎస్ చెప్పారు. గోదావరి, కృష్ణా నదుల పరీవాహక ప్రాంతాల్లో కలెక్టర్లు మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. చెరువులకు స్థానికులు గండ్లు పెట్టకుండా నీటిపారుదల శాఖ అధికారులు పర్యవేక్షించాలని శాంతికుమారి తెలిపారు. పోలీసు, ఇరిగేషన్, విపత్తుల నిర్వహణ, పంచాయతీ రాజ్ శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్లను సీఎస్ శాంతికుమారి ఆదేశించారు.
ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా :జీహెచ్ఎంసీలో అత్యవసర బృందాలను అప్రమత్తం చేయడంతో పాటు మాన్ హోళ్లను తెరవకుండా నిఘా పెట్టాలని సీఎస్ ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా ఎస్పీ, సీపీ కార్యాలయాల్లో కంట్రోల్ రూంల ఏర్పాటుతో పాటు కలెక్టర్లతో సమన్వయంగా పనిచేయాలని ఆదేశించినట్లు డీజీపీ జితేందర్ తెలిపారు. హైదరాబాద్లో నీళ్లు నిలిచే ప్రాంతాల్లో ముందస్తుగా చర్యలు చేపట్టాలని సూచించారు. ఏవైనా ఫిర్యాదులు వస్తే వెంటనే ప్రజలకు అందుబాటులో ఉండాలని తెలిపారు.
నల్గొండ జిల్లాలో భారీ వర్షాలు - కొట్టుకుపోయిన 40 గ్రామాలను కలిపే కనెక్టివిటీ రోడ్డు - Road Washed Away in Nalgonda
తెలంగాణకు భారీ వర్ష సూచన - రెండు రోజుల పాటు భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు - telangana weather report