CS Jawahar Reddy meeting with Energy Department officials:సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పరిపాలన బాధ్యత అంతా సీఎస్ జవహర్ రెడ్డి చూస్తున్నారు. ఈ నేపథ్యంలో మెున్న నీటి సమస్యపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన సీఎస్, తాజాగా విద్యుత్ సమస్యలపై అధికారులతో సమావేశం నిర్వహించారు. రానున్న వేసవి దృష్టిలో ఉంచుకొని తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు పలు ఆదేశాలు జారీచేశారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో విద్యుత్ సమస్యలు నెలకొంటున్నాయంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో, అధికారులతో సీఎస్ భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
విద్యుత్ అంతరాయాలు లేకుండా చూడాలి: వేసవిలో ఎక్కడా విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చర్యలు చేపట్టాల్సిందిగా ఇంధనశాఖ అధికారులను సీఎస్ జవహర్ రెడ్డి ఆదేశించారు. సచివాలయంలో విద్యుత్ సరఫరా (Power supply) పరిస్థితులపై అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. వేసవితో పాటు విద్యార్ధులకు పరీక్షల దృష్ట్యా విద్యుత్ అంతరాయాలు లేకుండా చూడాలని స్పష్టం చేశారు. విద్యుత్ సమస్యలపై ఫిర్యాదు చేసేందుకు కాల్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సమస్యలపై కాల్ సెంటర్ కు వచ్చే ఫిర్యాదులపై నిర్దిష్ట కాలవ్యవధిలోగా చర్యలు తీసుకోవాల్సిందిగా జవహర్ రెడ్డి సూచించారు.