Deputy Cm Pawan Kalyan Visited Krishna District : కృష్ణా జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటించారు. గుడివాడ రూరల్ మండలం మల్లాయపాలెం తాగునీటి చెరువు, వాటర్ వర్క్స్ ను పవన్ కల్యాణ్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఫిల్టర్ బెడ్ల ద్వారా నీటిని శుద్ధి చేసే విధానాన్ని కలెక్టర్ బాలాజీ పవన్‌కు వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో నీటి సరఫరా వ్యవస్థ గ్యాలరీలను పవన్ వీక్షించారు. అనంతరం ఫిల్టర్ బెడ్ల ద్వారా సరఫరా అవుతున్న స్వచ్ఛమైన త్రాగునీటి నమూనాలను పరిశీలించారు.
కంకిపాడు మండలంలో గుడువర్రు గ్రామంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన పలు అభివృద్ధి పనులను ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పరిశీలించారు. రోడ్డు పనులు జరుగుతున్న చోట గొయ్యి తీయించి నాణ్యతను పవన్ పరిశీలించి అధికారులతో మాట్లాడారు. పవన్ కల్యాణ్ రోడ్డు సమస్యను పరిష్కరించడంతో పాటు రోడ్డు నాణ్యతను కూడా స్వయంగా వచ్చి పరిశీలించడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.
గిరిజనుల కష్టాల్లో తోడుంటాం - డోలీ మోతలు పోవాల్సిందే: పవన్ కల్యాణ్
కంకిపాడు బస్టాండ్ నుంచి గొడవర్రు వరకు మొత్తం ఐదు కిలోమీటర్ల రోడ్డును జాతీయ ఉపాధి హామీ పథకం, ఏస్డీఆర్ఎఫ్ నిధులతో నిర్మిస్తున్నారు. 3.63 కిలోమీటర్ల మేర గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో, మిగిలిన రోడ్డు ఎస్డీఆర్ఎఫ్ నిధులతో పూర్తి చేస్తారు. గొడవర్రు వరకు సీసీ రోడ్డు, అక్కడి నుంచి బీటీ రోడ్డును నిర్మాణం చేస్తున్నారు. ప్రస్తుతం రోడ్డు పనులు చివరి దశలో ఉన్నాయి. ఈ పనులు సంక్రాంతి నాటికల్లా పూర్తవుతాయని అధికారులు స్పష్టం చేశారు.
పనులు జరుగుతున్న తీరు, రోడ్డు ఎంతమందికి ప్రయోజనం? ఏ ప్రాతిపదికన వేస్తున్నారని పవన్ కల్యాణ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. గతంలో ఉన్న రోడ్డు పరిస్థితిని చిత్రాల ద్వారా అధికారులు ఉప ముఖ్యమంత్రికి చూపారు. మూడు లేయర్లుగా రోడ్డును వేస్తున్నామని, నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడడం లేదని అధికారులు తెలియజేశారు. రోడ్డును కేవలం ఉన్నది ఉన్నట్లు వేయవద్దని, పూర్తిగా రోడ్డును తొలిచి తర్వాత రోలర్ ద్వారా చదును చేయించిన అనంతరం లేయర్లు వచ్చేలా చూడాలని పవన్ అధికారులకు సూచించారు.
ప్రతి ఇంటికీ 'అమృతధార' - రక్షిత జలాలు అందించడమే లక్ష్యం : పవన్ కల్యాణ్
అధికారులు చెప్పిన లేయర్లకు తగ్గట్లుగా రోడ్డు వేస్తున్నారా? లేదా ? అన్నది రోడ్డును తవ్వించి మరీ పవన్ కల్యాణ్ పరిశీలించారు. రోడ్డును అర మీటరు లోతు వరకు తవ్వించి లేయర్లు మొత్తం పరిశీలించారు. గ్రావెల్‌తో పాటు తారు సమపాళ్లలో ఉన్నాయా? అన్నది చూసి తెలుసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో నాణ్యత విషయంలో రాజీ పడవద్దు అని అధికారులకు సూచించారు. ప్రజలు కూడా అభివృద్ధి కార్యక్రమాల్లో పాలుపంచుకొని ఏమైనా నాణ్యత విషయంలో తేడాలు ఉంటే వెంటనే సంబంధిత అధికారులు దృష్టికి లేదా తన దృష్టికి తీసుకురావాలని కోరారు. కూటమి ప్రభుత్వంలో ప్రజా ఖజానా నుంచి ఖర్చుపెట్టే ప్రతి రూపాయి ప్రజలకు పది కాలాలపాటు ఉపయోగపడేలా ఉండాలి అన్నదే తమ అభిమతమని పవన్ కల్యాణ్ చెప్పారు.
'ఈటీవీ భారత్' కథనానికి పవన్ కల్యాణ్ స్పందన - యువరైతు నవీన్‌తో భేటీ!