Rathasapthami Arrangements in Tirumala Temple : కలియుగ ప్రత్యేక్షదైవం శ్రీవేంకటేశ్వరుని క్షేత్రం తిరుమల రథసప్తమి వేడుకలకు ముస్తాబవుతోంది. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు సప్తవాహనాలపై దర్శనం ఇవ్వనున్న సప్తగిరీశుని దర్శనానికి వచ్చే భక్తుల కోసం టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. మలయప్ప స్వామి ఊరేగింపు కోసం తిరుమాఢ విధులను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు.
తిరుమలలో జరగనున్న రథసప్తమికి వచ్చే భక్తుల కోసం ఉద్యోగులు, సిబ్బంది, సమష్టిగా, ప్రణాళిక బద్ధంగా సేవలు అందించాలని టీటీడీ ఈవో శ్యామలరావు సూచించారు. రథసప్తమికి వచ్చే భక్తులకు అందించే సేవలపై తిరుమల ఆస్థాన మండపంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అదనపు ఈవో వెంకయ్య చౌదరి పాల్గొన్నారు. భక్తులకు ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉమ్మడి కార్యచరణతో పని చేయాలని సిబ్బందికి నిర్దేశించారు.
'ఫిబ్రవరి 4వ తేదీ మంగళవారం సూర్య జయంతి పురస్కరించుకుని తిరుమలలో రథసప్తమి వేడుకల నిర్వహణకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. శ్రీవారి సన్నిధిలో జరిగే రథసప్తమి వేడుకలను ఒకరోజు బ్రహ్మోత్సవంగా పిలుస్తారు. శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామి విశేషంగా 7 వాహనాలపై తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. ఈ రోజున సూర్యోదయం నుంచి జరిగే వాహన సేవలను వీక్షించేందుకు పెద్ద ఎత్తున వచ్చే భక్తులకు అసౌకర్యం కలగకుండా టీటీడీ చర్యలు చేపట్టింది.' -వేణుగోపాల దీక్షీతులు, తిరుమల ఆలయ ప్రధాన అర్చకులు
ఒకరోజు బ్రహ్మోత్సవానికి ముస్తాబవుతోన్న తిరుమల - సర్వాంగ సుందరంగా తిరువీధులు
రథసప్తమి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామని టీటీడీ అదనపు ఈవో వెంకయ్యచౌదరి తెలిపారు. ఆలయ మాడ వీధుల్లోని భక్తులకు వేసవి తాపం కలగకుండా షెడ్లు ఏర్పాటు చేశామన్నారు. వాహన సేవలు వీక్షించేందుకు వీలుగా తిరుమల పలు ప్రాంతాల్లో పెద్ద ఎల్‌ఈడీ తెరలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రతి రెండు గంటలకు అన్నప్రసాదం, నీరు, మజ్జిగ భక్తులకు అందజేస్తామన్నారు. పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించామని, భద్రతపరంగా పోలీసు శాఖ నుంచి నిరంతరం పర్యవేక్షణ చేస్తామన్నారు.
రథసప్తమి వేడుకల్లో భక్తుల రద్దీ దృష్ట్యా వీఐపీ బ్రేక్ తోపాటు పలు ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. తిరుపతిలో జారీ చేసే టైమ్ స్లాట్ సర్వదర్శన టోకెన్లు ఈనెల 3, 4, 5 తేదీల్లో నిలిపివేశారు.
రథసప్తమికి తిరుమల వెళ్తున్నారా? - టీటీడీ సూచనలు అస్సలు మిస్కావొద్దు