RTC hire Bus Stolen in Narsipatnam Depot of Anakapalli District : అనకాపల్లి జిల్లాలో ఆర్టీసీ బస్సు చోరీకి గురైంది. నర్సీపట్నం డిపోకి చెందిన ఆర్టీసీ అద్దె బస్సు ఆదివారం రాత్రి అపహరణకు గురికావటంతో అధికారులతో పాటు సిబ్బంది షాక్‌కు గురయ్యారు. నర్సీపట్నం డిపో నుంచి నిరంతరం తుని తిరిగే బస్సు ఆదివారం రాత్రి విధులు పూర్తయ్యాక సిబ్బంది బస్సును డిపోలో పార్క్ చేశారు. తిరిగి ఈరోజు(సోమవారం) యథావిధిగా విధుల్లో భాగంగా తెల్లవారుజామున 4:30 గంటలకు డ్రైవర్ బస్సును తీసేందుకు వెళ్తే అక్కడ బస్సు లేదు.
రెండు బృందాలుగా గాలింపు : దీంతో కంగారు పడ్డ బస్సు డ్రైవర్ వెంటనే డిపో మేనేజర్, బస్సు యజమానికి సమాచారం అందించారు. అనంతరం వారి సమాచారంతో నర్సీపట్నం పోలీసులు రెండు బృందాలుగా ఏర్పాడి గాలించారు. చివరికి నర్సీపట్నం నుంచి అల్లూరి జిల్లా చింతపల్లి వెళ్లే రూట్లో బస్సును కనుగొన్నారు. అనంతరం నిందితుడిని అదుపులోకి తీసుకొని బస్సును స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనతో నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని నర్సీపట్నం పట్టణ సీఐ గోవిందరావు వెల్లడించారు.
"ఈ రోజు ఉదయం బస్సు చోరీకి గురైనట్లు ఓ కంప్లైంట్ వచ్చింది. అందులో గీతంరాజు అనే వ్యక్తి ఏపీఎస్ ఆర్టీసీకి ఐదు అద్దె బస్సులను నడుపుతున్నారు. తుని నుంచి నర్సీపట్నం తిరిగే ఓ బస్సు అపహరణకు గురైనట్లు తెలిపారు. బస్సు డ్రైవర్ ఆదివారం రాత్రి 10.45 గంటలకు బస్సును డిపోలో పెట్టాడు. అనంతరం బస్సును శుభ్రం చేయాల్సిందిగా క్లీనర్‌కు చెప్పి వెళ్లిపోయాడు. అతడు రాత్రి 1 గంట వరకు శుభ్రం చేశాడు. అనంతరం బస్సు తాళం దానికే వదిలేసి ఇంటికి వెళ్లిపోయాడు. ఉదయం డ్రైవర్ వచ్చి చూసే సరికి డిపోలో బస్సు లేదు. యజమాని ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడితో పాటు బస్సును స్వాధీనం చేసుకున్నారు." - గోవిందరావు, నర్సీపట్నం పట్టణ సీఐ
టీటీడీ ఎలక్ట్రిక్ బస్సును చోరీ చేసిన వ్యక్తి అరెస్ట్
ప్రైవేటు ట్రావెల్స్ బస్ డ్రైవర్ దాష్టీకం - అయ్యప్ప భక్తుల బ్యాగులు పడేసి ఉడాయించిన వైనం