CS and DGP Explanation to EC on Violence in AP:ఎన్నికల సంఘం ముందు సీఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా వ్యక్తిగతంగా హాజరయ‌్యారు. ఎన్నికలు, పోలింగ్ అనంతరం రాష్ట్రంలో జరిగిన హింసాత్మక ఘటనలపై ఈసీకి వివరణ ఇచ్చారు. వీరితో పాటు నిఘా విభాగాధిపతి కుమారవిశ్వజిత్ సైతం ఉన్నారు. మాచర్ల, నరసరావుపేట, చంద్రగిరి, తాడిపత్రిలో హింస చెలరేగడంపై ఎన్నికల కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
విచ్చలవిడిగా దాడులు, వాహనాలు తగులబెట్టడం లాంటి ఘటనలను ఎందుకు అదుపు చేయలేకపోయారని ఈసీ నిలదీసింది. పరిస్థితిని అదుపు చేయకుండా ఏం చేస్తున్నారని ప్రశ్నించింది. దీనికి బాధ్యులు ఎవరంటూ మండిపడింది. హింసాత్మక ఘటనలు జరిగాక ఏం చర్యలు తీసుకున్నారో తమ ముందు హాజరైన వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్రంలో జరిగిన పరిణామాలపై ఈసీకి వివరణ ఇచ్చారు.
Election Commission about AP Clashes: దాదాపు 20 నుంచి 25 నిమిషాల పాటు ఎన్నికల సంఘం అధికారులు సీఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా నుంచి వివరణ తీసుకొని పంపించినట్లు తెలుస్తోంది. పల్నాడు, తాడిపత్రిల్లో దాడులు, చంద్రగిరిలో ఏకంగా టీడీపీ అభ్యర్థిపైనే దాడి చేయడం, శ్రీకాకుళం నుంచి కర్నూలు వరకు వరుసగా జరిగిన ఘటనలపై ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ముందుగానే ఆదేశించినా అధికారులు పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై మండిపడినట్లు తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల పోలింగ్ రోజు, ఆ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై ఆరా తీసిన ఈసీ అధికారులు ముందస్తుగా ఉన్న ఇంటెలిజెన్స్ సమాచారాన్ని ఏ విధంగా క్రోడీకరించుకున్నారని దానికి తగ్గట్టు ఏర్పాట్లు చేసినట్లు కూడా తమ దృష్టికి రాలేదని ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ముందుగానే హెచ్చరించినా చర్యలు తీసుకోవడంలో ఎందుకు విఫలమయ్యారని అభ్యర్థులపై దాడులు చేస్తుంటే ఎందుకు స్పందించలేదనే అంశాలపై వివరణ కోరినట్లు సమాచారం. ఈ క్రమంలో వీరిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారనే అంశంపై వివరాలు బయటకు రాలేదు.
ఏపీలో అల్లర్లపై ఈసీ సీరియస్- దిల్లీకి రావాలని సీఎస్, డీజీపీకి ఆదేశం - EC Issued Summons To AP CS And DGP