రాష్ట్రంలో జోరుగా ఐపీఎల్ ఆన్లైన్ బెట్టింగ్ - ఆగమవుతున్న యువత Cricket Betting Gang Arrested In Hyderabad :మద్యం, మాదక ద్రవ్యాలు, పేకాట యువత జీవితానికి శాపంగా మారిన వ్యసనాలు. ఇవే కాదు రాష్ట్రంలో మరో మహమ్మారి కూడా వేళ్లూనుకుపోయింది. బెట్టింగ్ ముఠాలు వరుసగా పట్టుబడుతుండం వీరి ఆగడాలకు అద్దం పడుతోంది. ప్రధానంగా హైదరాబాద్‌లోనే ఈ ఉదంతాలు ఎక్కువగా వెలుగుచూడడం కలకలం రేపుతోంది. సైబరాబాద్ పోలీసులు సోమవారం ఒకే రోజు 5 ముఠాల ఆట కట్టించారు. 15 మంది బుకీలు, ఆర్గనైజర్లను అదుపులోకి తీసుకున్నారు. రూ. 33.3లక్షల రూపాయల నగదు, బ్యాంకు ఖాతాల్లోని రూ. 2.07కోట్ల నగదు, రూ. 89లక్షల రూపాయల విలువైన 75 ఫోన్లు, 8 ల్యాప్‌టాప్‌లు స్వాధీనం చేసుకున్నారు. వీటి మొత్తం విలువ రూ. 3.29కోట్ల రూపాయలు. వంద బ్యాంకు ఖాతాల్లో మరో 10 కోట్ల రూపాయలు ఉన్నట్లు సైబరాబాద్ పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు.
IPL Betting Gang In Hyderabad: ఇంత భారీ స్థాయిలో బెట్టింగ్ నిర్వహిస్తున్న బెట్టింగ్ ముఠాలు ఒకే రోజు పట్టుబడడం కలకలం రేపుతోంది. ఇది కేవలం హైదరాబాద్‌లో వెలుగు చూసిన ఉదంతం కాగా, రాష్ట్ర స్థాయిలో ఇంకా ఏ స్థాయిలో విస్తరించిందో అనే ఆందోళన వ్యక్తం అవుతోంది. ఐపీఎల్ సీజన్ నడుస్తూ ఉండడంతో డబ్బు సంపాదించడానికి ఇదే అనువైన సమయం అని భావిస్తున్న బెట్టింగ్ రాయుళ్లు బృందాలుగా ఏర్పడి అక్రమ వ్యవహారాన్ని సాగిస్తున్నారు. అందుకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇళ్లు, అపార్ట్‌మెంట్లు, ఒక్కోసారి హోటళ్లను కేంద్రంగా చేసుకుని వ్యవహారాలు నడిపిస్తున్నారు. ల్యాప్‌టాప్‌లు, ఫోన్ల ద్వారా బెట్టింగ్ నిర్వహిస్తున్నారు.
ఆన్లైన్ బెట్టింగులతో జీవితాలు ఆగమాగం - బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులపై తీసుకుంటున్న చర్యలేంటి? - online betting games and apps
ఒక్కోసారి ప్రత్యేకంగా యాప్‌లను కూడా ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇతర రాష్ట్రాలకు చెందిన వారు కూడా ఇందులో భాగస్వాములవుతున్నారు. ఏపీ, రాజస్థాన్, మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటకకు చెందిన నిర్వాహకులు ఇక్కడ ఏజెంట్లను నియమించుకుని యథేచ్చగా దందా సాగిస్తున్నారు. గతంలో క్రికెట్ బెట్టింగ్‌లలో డబ్బులు పోగొట్టుకున్న చాలా మంది సబ్ ఏజెంట్లుగా మారుతున్నారు. ఇందులో విద్యార్థులు, యువకులు, చిరుద్యోగులు, ఐటీ నిపుణులు ఉంటున్నారు. సంపన్నుల నుంచి సామాన్యులు, చిరువ్యాపారుల వరకు అంతా వీరి బారిన పడుతున్నారు.
బెట్టింగ్ వలలో యువత :బెట్టింగ్ వలలో ప్రధానంగా యువత చిక్కుకుంటోంది. చదువుకోవాల్సిన వయసులో బెట్టింగ్‌లు కాస్తూ వేల నుంచి లక్షల రూపాయలను పోగొట్టుకుంటున్నారు. ఈ వ్యసనం వదలలేక అప్పులు చేస్తున్నారు. రుణయాప్‌లను ఆశ్రయిస్తున్నారు. అప్పులు తిరిగి చెల్లించలేక ఆ ఒత్తిడిలో చదువులను గాలికి వదులుతున్నారు. అప్పుల ఒత్తిడి ఇంకా ఎక్కువైతే ఆత్మహత్యలకు సైతం పాల్పడుతున్నారు. ఇలా యువత ప్రాణాలు తీసే స్థాయికి బెట్టింగ్ మహమ్మారి విస్తరించడం సర్వత్రా ఆందోళన కల్గిస్తోంది.
బెట్టింగ్ వలలో ఎక్కువ మంది చిక్కుకోవడానికి ప్రధాన కారణం కష్టపడకుండానే డబ్బు సంపాదించే వీలు ఉండడమే. చేతిలో స్మార్ట్‌ఫోన్ అందుబాటులో ఉండడం, వెబ్‌సైట్‌లు, యాప్‌ల ద్వారా సులభంగా ఆడే సదుపాయం ఉండడంతో ఎక్కువ మంది దీనికి ఆకర్షితులవుతున్నారు. సరదాగా బెట్టింగ్ కాయడం మొదలుపెట్టి చివరకు వ్యసనపరులుగా మారే వరకు దీని వలలో చిక్కుకుంటున్నారు. పెట్టిన డబ్బుతో పోలిస్తే ఎక్కువ డబ్బు తిరిగి వస్తూ ఉండడం మరో కారణం. రెండు మూడు సార్లు ఇలాగే ఎక్కువ డబ్బు వచ్చినా ఆ తర్వాత ఆశతో మరింత పెట్టి భారీగా నష్టపోతున్నారు. బెట్టింగ్ అనేక మార్గాల్లో సాగుతుంది. బంతి బంతికి, ఓవర్ ఓవర్‌కు, మ్యాచ్ మ్యాచ్‌కు ఇలా పలు మార్గాల్లో నిర్వహిస్తారు.
రెండేళ్ల క్రితం వేసిన లెక్కల ప్రకారం ఒక్క హైదరాబాద్‌లో జరుగుతున్న బెట్టింగ్ విలువ రోజుకు 30కోట్ల రూపాయల నుంచి 40 కోట్ల రూపాయల వరకు ఉంది. ఇప్పుడు అది ఇంకా ఎక్కువ ఉంటుందని అంచనా. రాష్ట్రం అంతటా ఇది అంతకు ఎన్నో రెట్లు ఎక్కువగా ఉంటుందని సమాచారం. బెట్టింగ్ దందా అరికట్టేందుకు పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఈ జాడ్యం అంతకంతకూ విస్తరిస్తోంది. బెట్టింగ్ రాయుళ్లను అరెస్టు చేసి జైలుకు పంపుతున్నా వీరు మారడం లేదు. జైలు నుంచి విడుదలైన తర్వాత కూడా తమ దందాను కొనసాగిస్తున్నారు.
బెట్టింగ్ పాల్పడకుండా తీసుకోవాల్సిన చర్యలు : ఆరంభంలో మురిపించి తర్వాత నిండా ముంచేసే బెట్టింగ్‌కు దూరంగా ఉండాలంటే స్వీయ నియంత్రణే ముఖ్యం. బెట్టింగ్ చేసే నష్టాన్ని గుర్తెరిగి దాని జోలికి వెళ్లకుండా ఉండడం ఉత్తమం. యువతే దీని వలలో ఎక్కువగా చిక్కుకుంటున్న నేపథ్యంలో తల్లితండ్రులు వీరిని ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. బెట్టింగ్‌లోకి దిగితే డబ్బులు నష్టపోవడమే కాదు పిల్లల భవిష్యత్తే అంధకారం అవుతుంది కాబట్టి మరింత అప్రమత్తంగా ఉండాలి. పోలీసులు ఎప్పటికప్పుడు బెట్టింగ్ ముఠాల ఆట కట్టిస్తున్నా తల్లితండ్రులు జాగ్రత్త వహించడమే చాలా కీలకం. ప్రజలు కూడా బెట్టింగ్ గురించి సమాచారం అందితే పోలీసులకు చేరవేయాలి. స్వచ్ఛంద సంస్థలు కూడా బాధ్యత తీసుకోవాలి. ఇలాంటి చర్యలు తీసుకుంటేనే బెట్టింగ్ జాడ్యం సమాజం నుంచి కొంతైనా దూరం అయ్యేందుకు ఆస్కారం ఉంటుంది. యువత భవిష్యత్తుకు భరోసా లభిస్తుంది.
బెట్టింగ్ ముఠాల ఆటకట్టిస్తున్న పోలీసులు - కోట్లలో నగదు స్వాధీనం - IPL Betting Racket Busted in Hyd
మియాపూర్‌లో క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్టు - 5 రోజుల వ్యవధిలో రెండో గ్యాంగ్ - cricket betting gang arrest