Police Arrested Man For Farming Drugs in Home : అవసరమైనప్పుడల్లా కొనుక్కొని రావడం, దానికి భారీగా డబ్బులు ఖర్చు అవుతుండటం ఈ వరంగల్ వాసికి ఇబ్బందిగా మారింది. పైగా పోలీసుల సమస్య ఒకటి. దీనంతటికి ఓ పరిష్కారం కావాలనుకున్నాడు. బుర్రకు పని చెప్పాడు. ఇంట్లోనే గృహ పరిశ్రమగా గంజాయి మొక్కల పెంపకం చేపట్టాడు. ఇలా చేస్తే తనకు ఖర్చు తప్పుతుంది, పనిలో పనిగా విక్రయిస్తే భారీగా డబ్బు కూడా లభిస్తుందని రంగంలోకి దిగాడు.
వరంగల్ శివనగర్ ప్రాంతానికి చెందిన పల్లెబోయిన కుమార్ (60), సులభంగా డబ్బు సంపాదనతో పాటు తన అవసరాల కోసం ఏకంగా ఇంటి మేడపై పూల కుండీల్లో గంజాయి మొక్కల పెంపకం చేపట్టాడు. అంతా బాగానే ఉంది, మొక్కలు కూడా పెరిగాయి, ఇక వాడుకోవడమే సరి అని అనుకుంటున్న సమయంలో ఎవరో ఈ సమాచారం పోలీసులకు అందించారు. ఇంకేముంది వరంగల్ యాంటీ డ్రగ్స్ టీం రంగంలోకి దిగింది. మత్తు పదార్థాలను పసిగట్టే పోలీస్ జాగిలంతో సోదాలు జరిపి మేడపైన గంజాయి మొక్కలను గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు.
మత్తు పదార్థాలను విక్రయిస్తే సమాచారం ఇవ్వండి : మాదక ద్రవ్యాల నియంత్రణ చట్టం కింద కుమార్‌ను అరెస్ట్ చేసిన డ్రగ్స్ కంట్రోల్ టీం పోలీసులు మీల్స్ కాలనీ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు మత్తు పదార్థాలను విక్రయిస్తున్నా, వాడుతున్నా, తరలిస్తున్నా వెంటనే 8712584473 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని యాంటీ డ్రగ్స్ టీం ఇన్ఛార్జ్ ఇన్స్పెక్టర్ సురేష్ తెలిపారు. ఇలా సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని భరోసా ఇచ్చారు.
ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే - డైరెక్టుగా డోర్ డెలివరీ! - హైదరాబాద్‌లో పెరుగుతోన్న డ్రగ్స్ కల్చర్
ఏజెన్సీ ఏరియా దాకా పోలేక ఇంట్లోనే గంజాయి సాగు మొదలెట్టాడు - POLICE SEIZE GANJA PLANTS IN HOME