Karthika Puranam Chapter 7 : వశిష్ఠులవారు జనకునితో కార్తిక మాసంలో ఆచరించాల్సిన విధి విధానాలను గురించి వివరిస్తూ ఇంకను ఇట్లు చెప్పసాగెను. "ఓ జనక మహారాజా! కార్తిక మాసము గురించి దాని మహాత్యమును గురించి ఎంత చెప్పినను, ఎంత విన్ననూ తనివి తీరదు. ఈ మాసంలో శ్రీమహావిష్ణువును సహస్రకమలములతో పూజించినవారి ఇంట లక్ష్మీదేవి స్థిరముగా ఉంటుంది. తులసీదళాలతో గాని, బిల్వపత్రములతోగాని శివకేశవులకు సహస్రనామ పూజ చేసినవారికి జన్మరాహిత్యము కల్గును.
సాలగ్రామ పూజ - వనభోజనం
కార్తిక మాసమునందు ఉసిరి చెట్టు కింద సాలగ్రామము నుంచి భక్తితో పూజించి, అక్కడే బ్రాహ్మణులకు భోజనము పెట్టి, తాను కూడా భుజించిన యెడల సర్వపాపములు పోవును. ఈ విధముగా కార్తిక స్నానములు, దీపారాధన చేయలేనివారు ఉదయం, సాయంకాలం ఏదైనా గుడికి వెళ్లి భక్తితో సాష్టాంగ నమస్కారం చేసినచో వారికి పుణ్యప్రాప్తి కలుగును. శక్తికలవారు శివకేశవుల ఆలయమునకు వెళ్లి భక్తితో దేవతార్చన, హోమాదులు, దానధర్మములు చేసినచో అశ్వమేధయాగము చేసినంత ఫలము కల్గును. వారి పితృదేవతలకు కూడా వైకుంఠ ప్రాప్తి కల్గును.
నంద దీపం ఎలా వెలిగించాలి?
కార్తిక మాసంలో తులసి కోట వద్ద ఆవుపేడతో అలికి వరిపిండితో శంఖుచక్ర ఆకారముల ముగ్గును పెట్టి, నువ్వులు, ధాన్యములు పోసి వానిపై ప్రమిద నుంచి నిండా నువ్వులనూనె పోసి, వత్తిని వేసి వెలిగించవలెను. ఈ దీపము రాత్రింబవళ్లు ఆరిపోకుండా వెలుగవలెను. దీనినే నంద దీపము అంటారు. ఈ విధముగా చేసి నైవేద్యం పెట్టి, కార్తిక పురాణము చదువుచుండిన యెడల హరిహరాదులు సంతృప్తి చెంది కైవల్యం మొసంగెదరు. అలాగే కార్తిక మాసములో ఈశ్వరుని జిల్లేడు పూలతో అర్చించిన ఆయుర్ వృద్ధి కలుగును.
యథాశక్తి కార్తిక పూజ
సాలగ్రామమునకు ప్రతి నిత్యము గంధము పూసి, తులసీ దళములతో పూజించవలెను. ఏ మనుజుడు ధనము, బలము కలిగివుండికూడా కార్తిక మాసంలో పూజాదులు చేయడో, ఆ మానవుడు మరుసటి జన్మలో శునకమై తిండి దొరకక ఇల్లిల్లూ తిరుగుతూ కర్రలతో దెబ్బలు తింటూ కడకు నీచస్థితిలో మరణించును. కావున కార్తిక మాసం నెలరోజులు పూజలు చేయలేనివారు ఒక్క సోమవారం రోజైన ఉపవాసం చేసి శివకేశవులను పూజించిన మాసము మొత్తం చేసిన ఫలం కలుగును కనుక "ఓ రాజా! నీవు కూడా ఈ వ్రతమును ఆచరింపుము." అని వశిష్ఠులవారు జనకునితో చెప్పెను.
ఇతి స్మాంద పురాణ కార్తిక మహాత్మ్యే సప్తమాధ్యాయ సమాప్తః
ఓం నమః శివాయ!
ముఖ్యగమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.