Phone Tapping Case Updates : ఫోన్ ట్యాపింగ్ కేసులో టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు బెయిల్ పిటివేషన్ను నాంపల్లి కోర్టు కొట్టివేసింది. పంజాగుట్ట పొలీసుల వాదనలు ఏకీభవిస్తు తీర్పు వెల్లడించింది. ప్రస్తుతం కేసు విచారణ కొనసాగుతోందని, బెయిల్ ఇస్తే కేసును తప్పుదారి పట్టించే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈనేపథ్యంలో బెయిల్ ఇవ్వద్దని కోర్టులో పోలీసులు కౌంటర్ దాఖలు చేశారు.
రాధాకిషన్‌రావు ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. గత నెలల్లో తన తల్లికి అనారోగ్యం దృష్ట్యా బెయిల్ ఇవ్వాలని కోర్టును కోరారు. రాధాకిషన్‌రావు అభ్యర్థనను పరిగణనలోకి తీసుకోన్న కోర్టు, తల్లిని చూడటానికి వెళ్లేందుకు అనుమతి ఇచ్చింది. ఈకేసులో మరో ముగ్గురు నిందితులు ప్రణీత్ రావు, తిరుపతన్న, భుజంగరావుల బెయిల్ పిటిషన్‌ను గత నెలల్లో నాంపల్లి కోర్టు కొట్టివేసిన సంగతి తెలిందే.
మరోవైపు ఫోన్ ట్యాపింగ్ నిందితులపై దర్యాప్తు బృందం సైబర్ టెర్రరిజం సెక్షన్లు నమోదు చేసింది. ఈ కేసులో ఐటీ యాక్ట్ 66(ఎఫ్)ను ప్రయోగించనున్న పోలీసులు, ఈ మేరకు నాంపల్లి కోర్టులో మెమో దాఖలు చేయనున్నారు. ఈ కేసులో దర్యాప్తు బృందం, ఇద్దరు కానిస్టేబుళ్లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు తెలుస్తోంది. మునుగోడు ఉపఎన్నికల సందర్భంగా పలువురి రాజకీయ నేతల ఫోన్లపై, ఈ ఇద్దరు కానిస్టేబుళ్లు ట్యాపింగ్ చేసినట్టు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలోనే వారిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్టు సమాచారం. విచారణ అనంతరం వీరి పాత్ర ఉందని తేలితే దర్యాప్తు బృందం అరెస్టు చేసే అవకాశం ఉంది.