Jani Master Bail News Latest : కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు బెయిల్ మంజూరైంది. హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. జానీ మాస్టర్, ఆయన కుటుంబ సభ్యులు బాధితురాలి వ్యక్తిగత జీవితంలో కల్పించుకోవద్దని, ఆమె పని చేసే వద్దకు వెళ్లి ఏమైనా ఇబ్బందులు కలిగించినా బెయిల్ రద్దు చేస్తామని హైకోర్టు షరతులు విధించింది. మహిళా కొరియోగ్రాఫర్ ఫిర్యాదు మేరకు నార్సింగి పోలీస్ స్టేషన్‌లో జానీ మాస్టర్‌పై గత నెల పలు సెక్షన్ల కింద కేసులు నమోదైన సంగతి తెలిసిందే.
మైనర్‌గా ఉన్నప్పుడు జానీ మాస్టర్ లైంగిక దాడి చేశాడంటూ మహిళా కొరియోగ్రాఫర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. జానీ మాస్టర్ నుంచి దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తే, ఇంటికి వచ్చి బెదిరింపులకు పాల్పడ్డాడని బాధితురాలు పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. షూటింగ్ సమయంలోనూ మేకప్ వ్యాన్‌లోకి తీసుకెళ్లి, పలుమార్లు లైంగిక దాడి చేసినట్లు పేర్కొన్నారు. నిరాకరిస్తే మేకప్ వ్యాన్‌లో ఉన్న అద్దానికేసి తలను బాదినట్లు బాధితురాలు పోలీసులకు తెలిపారు.
బాధితురాలి వాంగ్మూలం మేరకు జానీ మాస్టర్‌ను గత నెలలో అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు. రంగారెడ్డి జిల్లా కోర్టులో జానీ మాస్టర్ బెయిల్ పిటిషన్ దాఖలు చేసినా కోర్టు కొట్టేసింది. దీంతో హైకోర్టును ఆశ్రయించారు. మహిళా కొరియోగ్రాఫర్ పూర్తిగా అబద్ధాలు చెబుతున్నారని, జానీ మాస్టర్ తరఫు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. జానీ మాస్టర్‌కు డాన్స్‌లో జాతీయ స్థాయి అవార్డు రావడంతో ఓర్చుకోలేని మహిళా కొరియోగ్రాఫర్, తప్పుడు కేసులు పెట్టారని వాదించారు. మహిళా కొరియోగ్రాఫర్‌పై లైంగిక దాడికి పాల్పడిన జానీ మాస్టర్ ఆమెను ఎదగకుండా అణచి వేస్తున్నాడని బాధితురాలి తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఇరువురి వాదనలు విన్న హైకోర్టు, షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.