తెలంగాణ

telangana

ETV Bharat / state

రూ.300 దర్శనం టికెట్లకు రూ.1500 నుంచి రూ.2000 వసూలు - అందుకే రద్దు నిర్ణయం - TTD DARSHAN TICKETS IN AP

రూ.300 టికెట్ల విషయంలో పర్యాటక, ఆర్టీసీ ఏజెంట్ల చేతిలో మోసపోతున్న శ్రీవారి భక్తులు - ఆ కోటా రద్దు చేసిన టీటీడీ

Tirumala Darshan Ticket Sales Scam
Corruption in Tirumala Darshan Ticket Sales (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Nov 23, 2024, 11:49 AM IST

Corruption in Tirumala Darshan Ticket Sales :శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు ఆయా రాష్ట్రాల టూరిజం ప్యాకేజీలు, ఆర్టీసీలకు కేటాయించిన ఎస్‌ఈడీ రూ.300 టికెట్లు రద్దు చేస్తూ ఇటీవలి బోర్డు సమావేశంలో టీటీడీ నిర్ణయం తీసుకుంది. వైసీపీ హయాంలో ఈ టికెట్లు దుర్వినియోగం అయ్యాయని రెండు, మూడు రెట్లకు పైగా ధరకు వాటిని విక్రయించినట్లు వెల్లడైంది. ముఖ్యంగా శని, ఆదివారాల్లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు, ఉద్యోగులు, విద్యార్థుల నుంచి ఉన్న డిమాండును సొమ్ము చేసుకున్నట్లు సమాచారం. గత వైసీపీ ప్రభుత్వ హయాంలోని టీటీడీ ధర్మకర్తల మండలి తెలంగాణ రాష్ట్రంతో పాటు వివిధ రాష్ట్రాల పర్యాటక ప్యాకేజీలు, ఆర్టీసీలకు రూ.300 టికెట్లను భారీగా జారీ చేసింది.

ఏపీఎస్‌ ఆర్టీసీకి రోజుకు 1000 టికెట్లు, ఏపీ పర్యాటక శాఖకు మరో వెయ్యి టికెట్లు ఇచ్చారు. తెలంగాణ పర్యాటక శాఖకు 350, తెలంగాణ ఆర్టీసీకి 1,000, గోవా పర్యాటక శాఖకు 100, ఇండియన్‌ రైల్వేస్‌కు 250, ఇండియన్‌ టూరిజం విభాగానికి 100, కర్ణాటక పర్యాటక శాఖకు 500, తమిళనాడు పర్యాటక శాఖకు 1,000, పుదుచ్చేరి పర్యాటక శాఖకు 100 కలిపి మొత్తం 5,400 టికెట్లను జారీ చేసింది. ఆయా రాష్ట్రాల నుంచి తిరుమలకు వచ్చే భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించడంతో పాటు ఆయా రాష్ట్రాల పర్యాటక శాఖలను అభివృద్ధి చేసి ప్రజా రవాణాకు ఆదాయాన్నిపెంచేందుకు ఇలా టికెట్లు కేటాయిస్తున్నామని గత టీటీడీ ధర్మకర్తల మండలి ప్రకటించింది.

ఏజెంట్ల చేతుల్లోకి శ్రీవారి దర్శన టికెట్లు : రూ.300 ఎస్‌ఈడీ టికెట్లను ఆయా రాష్ట్రాల పర్యాటక శాఖలు, ఆర్టీసీ ఏజెంట్ల ద్వారా భక్తులకు అందించేవారు. దీన్ని అదునుగా చేసుకొని కొంత మంది ఎక్కువ రేట్లకు టికెట్లను అమ్ముకున్నారు. పర్యాటక శాఖ, ఆర్టీసీల నుంచి టికెట్లు పొందిన ఏజెంట్లు సామాజిక మాధ్యమాల్లో వాటిని అమ్మకానికి పెట్టారు. దర్శన టికెట్లు కావాలనే వారికి రూ.300 టికెట్‌ను రూ.1,500 నుంచి రూ.2,500 వరకు అమ్ముకున్నారు. హైదరాబాద్‌కు చెందిన రమేష్‌ శ్రీవారి దర్శనానికి తెలంగాణ పర్యాటకశాఖ అనుమతి పొందిన ఏజెంట్‌ను సంప్రదించగా, రూ.300 దర్శన టికెట్లకు మూడింతల ధర తీసుకున్నారు.

చెన్నైకి చెందిన సుబ్రమణియన్‌ శ్రీవారి దర్శనానికి తమిళనాడు టూరిజం ఏజెంట్‌ను సంప్రదించగా, ఆయన నుంచి దర్శన టికెట్లతో పాటు రానూపోనూ ఛార్జీలు కలిపి రెండింతలు వసూలు చేసినట్లు విచారణలో వెల్లడైంది. మరికొందరు ఏజెంట్లు భక్తులకు రూ.300 టికెట్లను బస్సు టికెట్లతో పాటు విక్రయించాల్సి ఉండగా, రెండింటి ధర వసూలు చేసి దర్శన టికెట్లనే విక్రయించినట్లు వెల్లడైంది.

రూ.300 టికెట్లు రద్దు: రూ.300 టికెట్ల అక్రమాలపై కూటమి ప్రభుత్వం దృష్టిపెట్టింది. టీటీడీ విజిలెన్స్‌ వింగ్‌ వీజీవో రామ్‌కుమార్‌ ఆధ్వర్యంలోని ఒక ప్రత్యేక బృందం ఈ ఫిర్యాదులపై దర్యాప్తు చేసింది. టీటీడీ టికెట్ల విషయంలో భక్తులు ఏజెంట్ల చేతిలో మోసపోతున్నట్లు గుర్తించారు. ఆ నివేదికపై టీటీడీ ధర్మకర్తల మండలి స్పందించింది. దీంతో ఏపీతో పాటు, వివిధ రాష్ట్రాల పర్యాటక శాఖలు, ఆర్టీసీలకు కేటాయించే రూ.300 టికెట్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది.

భక్తులకు శుభవార్త : ఫిబ్రవరి నెల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల

శ్రీవారి భక్తులకు గుడ్‌ న్యూస్‌ - ఇకనుంచి 2 గంటల్లోనే సర్వదర్శనం!

ABOUT THE AUTHOR

...view details