TTD Board Meeting : ఏఐ సాంకేతికతతో తక్కువ సమయంలో భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించే విషయమై అధ్యయానానికి మూడు సంస్థలు ముందుకొచ్చాయి.. ఇది పూర్తి కావడానికి మూడు నెలలు సమయం పడుతుందని ధర్మకర్తల మండలి ఛైర్మన్ బీ.ఆర్. నాయుడు పేర్కొన్నారు. ఇకనుంచి తిరుమల తిరుపతి దేవస్థానం కార్యక్రమాలను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేలా చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఇందుకోసం ఒక కమిటీని వేయనున్నామన్నారు. తిరుమలలో మంగళవారం జరిగిన తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి సమావేశంలో ఛైర్మన్ బి.ఆర్.నాయుడు, టీటీడీ ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్యచౌదరి, జేఈవోలు గౌతమి, వీరబ్రహ్మం, బోర్డు సభ్యులు పాల్గొన్నారు. అనంతరం ఛైర్మన్, ఈవో మీడియాతో మాట్లాడుతూ బోర్డు నిర్ణయాలను వివరించారు.
టీటీడీ బోర్డు తీర్మానాలు :
- స్విమ్స్‌కు జాతీయ హోదా ఇవ్వాలని కేంద్రాన్ని కోరతాం. ఆ హోదా వస్తే ఆ ఆసుపత్రికి కేంద్ర సాయం అంది ఇంకా అభివృద్ది చెందుతుంది.
- శ్రీవారిని దర్శించుకోవడానికి నడకదారిలో వచ్చే భక్తుల కోసం వైద్య సదుపాయాలు, పరికరాలు అందుబాటులో ఉంచడానికి సర్జన్లు, వైద్యులు, నర్సుల పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోనున్నారు.
- తిరుమలలో 17 పెద్ద క్యాంటీన్ల నిర్వహణ సక్రమంగా లేవన్నారు. విదేశాల్లోని పలు పేరున్న రెస్టారెంట్లు ఆసక్తి చూపుతున్న నేపథ్యంలో వాటి ద్వారా భక్తులకు నాణ్యమైన ఆహారాన్ని అందించేందుకు త్వరలో కొత్త విధానం తీసుకురానున్నట్లు నిర్ణయించుకున్నారు.
- అన్నప్రసాద విభాగంలో 258 మంది సిబ్బంది నియామకానికి నిర్ణయం.
- రెస్టారెంట్లలో ఆహార తనిఖీకి నలుగురు నిపుణులతో ఆహార భద్రత విభాగం.
- నవీ ముంబయిలో శ్రీవారి ఆలయం పక్కన పద్మావతి అమ్మవారి ఆలయ నిర్మాణానికి తక్కువ ధరకు భూమి పొందేలా మహారాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞాపన పంపాలని నిర్ణయించుకున్నారు.
- క్యూలైన్లలో నిరీక్షించే భక్తుల కోసం అదనంగా మరుగుదొడ్ల బ్లాకుల నిర్మాణం.
- విశాఖ శారదాపీఠం మఠం లీజు రద్దుపై వారికి షోకాజ్ నోటీసులు జారీ. వారి నుంచి జవాబు వచ్చిన తర్వాత భవనంపై ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో ఆలోచిస్తామన్నారు. మిగిలిన మఠాలపైనా అధ్యయనం చేయనున్నట్లు తెలిపారు.
- కంచి పీఠం ఆధ్వర్యంలో పలు సంప్రదాయ పాఠశాలకు రూ.2 కోట్లు ఆర్థిక సహాయం(తిరుపతిలోని)