Corruption in Cultivation of Plants in Anantapur :అనంతపురంలో మొక్కల పెంపకం అధికారులు, వైఎస్సార్సీపీ నాయకులకు కాసుల వర్షం కురిపిస్తోంది. పచ్చదనం పేరుతో ఖరీదైన మొక్కలను తెప్పిస్తూ నిధులను మింగేస్తున్నారు. కర్బన ఉద్గారాలు తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక పథకం అమలు చేస్తోంది. ఈ పథకం కింద దేశంలోని అన్ని నగరపాలక సంస్థలకు మొక్కల పెంపకానికి వందల కోట్ల రూపాయలు ఇచ్చింది. దీనిలో భాగంగా కేంద్రం నుంచి వచ్చిన నిధులతో అనంతపురం నగరపాలక సంస్థ వర్టికల్ గార్డెన్ పెంచడానికి చర్యలు చేపట్టింది. ఏటా మొక్కల పెంపకానికే కోట్ల రూపాయలు వెచ్చించి వైఎస్సార్సీపీ గుత్తేదారులకు అప్పనంగా కట్టబెట్టింది.
44వ నెంబర్ జాతీయ రహదారిపై వంతెన పిల్లర్లకు వర్టికల్ గార్డెన్ ఏర్పాటు చేశారు. ఇదే అదనుగా భావించిన గుత్తేదారు దోచుకునేందుకు వీలుగా ఖరీదైన మొక్కలను తెప్పించారు. అనంతపురం వాతావరణ పరిస్థితులకు అనువుకాని మొక్కలను తీసుకువచ్చి నాటడంతో ఏ ఒక్కటీ నెల రోజులు కూడా బతకడం లేదు.
జనసేన నేతలు ఆగ్రహం : వర్టికల్ గార్డెన్ మొక్కలు ఎండిపోతుంటే మళ్లీ నిధులు ఖర్చు చేసి కొత్తవి తెచ్చి నాటిస్తూ నగరపాలక సంస్థ అధికారులు బంగారు గుడ్డు పెట్టే బాతులా మార్చేసుకున్నారనే ఆరోపణలున్నాయి. దీని కోసం వైఎస్సార్సీపీ గుత్తేదారుడికి కోటి రూపాయల వరకు అప్పనంగా ఇచ్చారు. ఇంతేకాదు డివైడర్లలో నాటేందుకు కడియం నుంచి వేల రూపాయలు ఖర్చు చేసి ఆర్నమెంటల్ మొక్కలు తీసుకొచ్చి నాటారు. సంరక్షణ లేక మొక్కలు ఎండుతున్నా అధికారులు పట్టించుకోవట్లేదని జనసేన నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.