Amit Shah Morphing Video Case Update :కేంద్ర హోంమంత్రి అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసులో దిల్లీ పోలీసులు ఇచ్చిన నోటీసులపై పీసీసీ లీగల్ సెల్ నేతలు వివరణ ఇచ్చారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో స్టార్ క్యాంపెయినర్ అయిన సీఎం రేవంత్ రెడ్డి తీరిక లేకుండా ఉన్నందున నాలుగు వారాల గడువు కావాలని దిల్లీ పోలీసులను కోరినట్లు లీగల్ సెల్ నాయకులు తెలిపారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసులో ఇటీవలే గాంధీభవన్‌లో పోలీసులు నోటీసులిచ్చారు. రేవంత్ రెడ్డి సహా పీసీసీ సామాజిక మీడియా ఛైర్మన్ మన్నెే సతీశ్, నవీన్, శివకుమార్, అస్మా తస్లీమ్కి దిల్లీ పోలీసులు నోటీసులు అందించారు.
ఐతే సాంకేతికపర అంశాలని పూర్తిస్థాయిలో పరిశీలన చేయాల్సి ఉన్నందున లీగల్ సెల్ ఛైర్మన్ మన్నే సతీశ్, మరో ముగ్గురికి రెండు వారాలు గడువు కావాలని కోరినట్లు సమాచారం. పీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్ రెడ్డి లోక్‌సభ ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్‌గా తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ ప్రచారం చేస్తున్నందున నేడు విచారణకు రాలేరని తెలిపారు. సీఎం విచారణకు హాజరయ్యేందుకు నాలుగు వారాల గడువు కావాలని కోరినట్లు లీగల్ సెల్ నాయకులు తెలిపారు.
కాంగ్రెస్ సోషల్ మీడియా కార్యకర్త ఫోన్ జప్తు : కాంగ్రెస్ సోషల్ మీడియా కార్యకర్త గీత ఫోన్‌ను దిల్లీ పోలీసులు జప్తు చేశారు. సికింద్రాబాద్ శాంతినగర్‌కు చెందిన గీతకు 41ఏ నోటీసులు ఇచ్చి, ఈ నెల 5వ తేదీన విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.