Niranjan Reacts on Phone Tapping :కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వ్యవస్థలను దుర్వినియోగం చేస్తోందని, రాష్ట్రంలోనూ బీఆర్ఎస్(BRS) ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడిందని కాంగ్రెస్ సీనియర్ ఉపాధ్యక్షుడు నిరంజన్ ధ్వజమెత్తారు. తెలంగాణ పోలీసులు అంటే గొప్పగా చెప్పుకొన్న పరిస్థితి నుంచి, ఇప్పుడు సిగ్గుపడే విధంగా మారిందని ఆయన విమర్శించారు.
బీఆర్ఎస్ హయాంలో ముగ్గురు కీలక హోదాల్లో ఉన్న సివిల్ సర్వీస్ అధికారులు అపరిమిత అధికారం, మితిమీరిన స్వేచ్ఛతో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ప్రముఖ వార్తపత్రికలో కవర్స్టోరీగా వచ్చినట్లు నిరంజన్ తెలిపారు. వీరందరూ కలిసి కీలకమైన రెవెన్యూ, పోలీసు, మున్సిపల్ వ్యవస్థలను భ్రష్టు పట్టించారని ఆయన ఆరోపించారు. ఈ సాంకేతికతను ఇజ్రాయిల్ నుంచి తీసుకువచ్చారని, వాటిని దుర్వినియోగం చేసినట్లు ఆయన తెలిపారు.
రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఇంటి నుంచి 300 మీటర్ల దూరంలో ఇల్లు అద్దెకు తీసుకుని అయన ఫోన్‌ను ట్యాపింగ్ చేశారని నిరంజన్ ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్‌లో అప్పటి డీజీపీ, హోంమంత్రి ఇతర అధికారులపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయని పేర్కొన్నారు. ఇంటెలిజెన్స్ అధికారుల పనితీరును పర్యవేక్షించే, కౌంటర్ ఇంటెలిజెన్స్ ఏం చేస్తోందని నిరంజన్ ప్రశ్నించారు. ప్రణీత్ రావు బ్యాచ్ వ్యాపారస్తులను కూడా బ్లాక్ మెయిల్ చేసి వేల కోట్లు దండుకుందని మండిపడ్డారు. ఈ విషయంలో డీజీపీ, హోం సెక్రటరీకి లేఖ రాస్తామని తెలిపారు. దీనిపై సమగ్ర విచారణ జరగాల్సి ఉందన్నారు.
"రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడింది. బీఆర్ఎస్ హయాంలో ముగ్గురు కీలక హోదాల్లో ఉన్న సివిల్ సర్వీస్ అధికారులు అపరిమిత అధికారం, మితిమీరిన స్వేచ్ఛతో వ్యవస్థల దుర్వినియోగానికి పాల్పడ్డారు. రేవంత్ రెడ్డి ఇంటి నుంటి 300 మీటర్ల దూరంలో ఇల్లు అద్దెకు తీసుకుని అయన ఫోన్‌ను ట్యాపింగ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్‌లో అప్పటి డీజీపీ, హోంమంత్రి ఇతర అధికారులపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి".- నిరంజన్, కాంగ్రెస్ సీనియర్ ఉపాధ్యక్షుడు