Government Serious On Aasara Pensions Misuse in Telangana : రాష్ట్రంలో దారిద్య్ర రేఖకు దిగువన ఉండే పేద కుటుంబాల వారికి అందాల్సిన ఆసరా పింఛన్లు దుర్వినియోగమవుతున్నట్లు రేవంత్ రెడ్డి ప్రభుత్వం గుర్తించింది. నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, ప్రభుత్వ కుటుంబ పింఛను పొందుతున్న వారు కూడా ‘ఆసరా’ పొందుతున్నారని తెలిసింది. ఇదే అంశంపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.
ప్రభుత్వ విచారణలో బయటపడిన వారికి ఈ పింఛను రద్దు చేయడంతో పాటు గతంలో పొందిన మొత్తాన్ని రికవరీ చేయాలని ఆదేశించింది. ప్రభుత్వ నిబంధనల మేరకు తెల్లకార్డు కలిగిన పేద వితంతువులు, ఒంటరి మహిళలు, వృద్ధులు, బీడీ కార్మికులు, రాళ్లు కొట్టేవారు, చేనేత పని వారు, దివ్యాంగులు, డయాలసిస్, పైలేరియా, హెచ్‌ఐవీ రోగులకు ఆసరా పథకం వర్తిస్తుంది. దారిద్య్ర రేఖకు దిగువన ఉండి, తెల్లరేషన్ కార్డు ఉన్నవారు ఈ పింఛనుకు అర్హులు.
ఇటీవల కొందరు ప్రభుత్వోద్యోగులు, వారి కుటుంబీకులు, పదవీ విరమణ అనంతరం పొందే పింఛన్లతో పాటు ఆసరా పింఛన్లు అందుకుంటున్నట్లు ప్రభుత్వానికి ఫిర్యాదులు అందడంతో దానిపై విచారణ జరపాలని రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్)ను ఆదేశించింది. రాష్ట్రవ్యాప్తంగా సెర్ప్, ఆర్థిక శాఖ వద్ద ఉన్న జాబితాలను పరిశీలించగా, అందులో మొత్తం 5,650 మంది ప్రభుత్వోద్యోగులు తమ రిటైర్‌మెంట్ పింఛనుతో పాటుగా ఆసరా పింఛన్లు అందుకున్న జాబితాలో ఉన్నట్లు తెలిసింది. వీరిలో 3,824 మంది ఇప్పటికే చనిపోయినట్లు గుర్తించారు. మిగతా 1,826 మంది ఇప్పటికీ రెండు పింఛన్లు అందుకుంటున్నట్లు వెల్లడైంది.