Congress Focus on Parliament Election 2024 :లోక్‌సభ ఎన్నికలపై రాష్ట్ర కాంగ్రెస్ కసరత్తు ముమ్మరం చేసింది. 17 స్థానాలపై దృష్టిపెట్టిన హస్తం నేతలు, 14 ఎంపీ స్థానాలు కైవసం చేసుకునే లక్ష్యంతో పావులు కదుపుతున్నారు. రాజ్యసభ ఎన్నికల తర్వాత లోక్‌సభ షెడ్యూల్ వెలువడే అవకాశం ఉందని అంచనా వేస్తున్న రాష్ట్ర నాయకత్వం, ఆ దిశగా కార్యాచరణను వేగవంతం చేసింది. 17 నియోజకవర్గాలకు 309 మంది ఆశావహులు దరఖాస్తు చేసుకోగా, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వడపోత పూర్తి చేసి స్క్రీనింగ్ కమిటీకి నివేదించింది. హరీశ్ చౌదరి ఛైర్మన్‌గా ఉన్న స్క్రీనింగ్ కమిటీ ఈ జాబితాను పరిశీలించి నియోజకవర్గానికి ముగ్గురు లెక్కన పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీకి అందించేందుకు కసరత్తు ప్రారంభించింది.
చేరికలను ఆహ్వానిస్తూ, బలమైన అభ్యర్థులను ఎంపిక చేస్తూ - 'పార్లమెంట్'లోనూ హస్తం 'అసెంబ్లీ' స్ట్రాటజీ
Congress Parliament Election Strategies :అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పటికీ కాంగ్రెస్‌వ్యూహకర్త సునీల్ కనుగోలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పార్టీ సీనియర్లతో కలిసి రెండు గంటల పాటు చర్చించినట్లు తెలుస్తోంది. ప్రజాభిప్రాయాన్ని అంచనా వేసేందుకు సునీల్ కనుగోలు బృందం సర్వేలు చేస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీ అధికారం చేపట్టిన తర్వాత క్షేత్రస్థాయిలో అనుకూలతలపై ఆరా తీస్తున్నారు. ఆరు గ్యారంటీలు అమలుకు తీసుకుంటున్న చర్యలు, టీఎస్పీఎస్సీ ప్రక్షాళన, ఉద్యోగాల భర్తీకి కసరత్తు, రైతుబంధు చెల్లింపులు తదితర అంశాలతో పార్టీకి ఆదరణ బాగా పెరిగినట్లు పార్టీ నాయకత్వం భావిస్తోంది. అయితే ఇది ఎంత వరకు వాస్తవం అనే అంశాన్ని తెలుసుకునేందుకు సర్వేలను ఆధారంగా చేసుకున్నారు.కాంగ్రెస్‌అధికారంలోకి వచ్చే నాటికి రాష్ట్రంలో ఎంత శాతం పార్టీకి అనుకూలంగా ఉన్నారు? అధికారం చేపట్టిన తర్వాత తాజా పరిస్థితి ఏంటి? అనే విషయాలపై వివరాలు సేకరిస్తున్నారు.