CM Revanth Reddy Visit Yadadri Temple : రాష్ట్రప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మూసీ పునరుజ్జీవంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మూసీ పరివాహక ప్రాంతంలో ఇవాళ పాదయాత్ర నిర్వహిస్తున్నారు. తన పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక హెలిక్యాప్టర్‌లో యాదగిరిగుట్టకు చేరుకున్న ముఖ్యమంత్రికి, మంత్రులు తుమ్మల, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో పాటు స్థానిక నేతలు సాదర స్వాగతం పలికారు. యాదగిరిగుట్ట హెలిప్యాడ్ నుంచి ప్రెసిడెన్షియల్ సూట్‌రూమ్‌కి వెళ్లిన సీఎం, విష్ణు పుష్కరిణి వద్ద నమస్కారం చేసుకున్నారు. నీళ్లను తలపై చల్లుకుని, అక్కడ నుంచి సంప్రదాయ దుస్తులు ధరించి ఆలయానికి చేరుకున్నారు. సీఎంకు అర్చకులు వేదాశీర్వచనం పలికి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.
సంగెం నుంచి మూసీ నది పునరుజ్జీవన సంకల్ప పాదయాత్ర :యాదగిరిగుట్ట ఆలయ ప్రాంగణంలో అఖండ దీపారాధనను ముందుగా దర్శించుకున్నారు. దీపం వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన వెంట మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి, తుమ్మల, పొన్నం, కొండా సురేఖ ఉన్నారు. అనంతరం యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధిపై వైటీడీఏ అధికారులతో సమీక్ష నిర్వహించారు.
టీటీడీ తరహాలో టెంపుల్ బోర్డ్ : యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని సమావేశంలో సీఎం అధికారులకు స్పష్టం చేశారు. టెంపుల్ బోర్డు ఏర్పాటు చేసేందుకు కావాల్సిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. టీటీడీ తరహాలో యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు ఉండేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. టీటీడీ స్థాయిలో బోర్డుకు ప్రాధాన్యత ఉండేలా పూర్తి అధ్యయనంతో బోర్డును ఏర్పాటు చేయాలన్నారు.