CM Revanth Review on Government Schools : తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారాలని, వాటిపై ప్రజలకు నమ్మకం కలిగించేలా చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రతి బడిలోనూ పూర్తి మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. వేసవి సెలవులు ముగిసేలోగా పాఠశాలల్లో పనులు పూర్తి చేయాలని, అన్నింటా స్పష్టమైన మార్పు కనిపించాలని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనపై ముఖ్యమంత్రి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.
Revanth on Govt Schools Development : విద్యార్థులకు యూనిఫాంలతో పాటు పాఠశాలల్లో మౌలిక సదుపాయాల ఏర్పాటు, పర్యవేక్షణ బాధ్యతలను స్వయం సహాయక మహిళా సంఘాలకు అప్పగించే అంశాన్ని పరిశీలించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సూచించారు. దీని ద్వారా నిరంతర పర్యవేక్షణ ఉండటంతో పాటు మహిళలకు ఆర్థిక చేయూత అందించవచ్చని చెప్పారు. బడుల్లో కిందిస్థాయి సిబ్బందిని నియమిస్తామని వివరించారు. ప్రతినెలా ప్రధానోపాధ్యాయుల ఖాతాల్లో డబ్బులు వేసి వారికి వేతనాలు చెల్లిస్తామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలకు తక్షణమే ఉచిత విద్యుత్ సదుపాయం కల్పించాలని రేవంత్‌రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ఫార్మా, లైఫ్‌సైన్స్ రంగ విస్తరణకు కట్టుబడి ఉన్నాం : సీఎం రేవంత్ రెడ్డి
గ్రీన్ ఛానల్ ద్వారా నిధులు మంజూరు చేయాలి : ఇతర రాష్ట్రాల్లోని ప్రభుత్వ బడుల్లో (Govt Schools) మౌలిక సదుపాయాలను పరిశీలించి తెలంగాణలోనూ అమలు చేయాలని రేవంత్‌రెడ్డి వివరించారు. గ్రీన్ ఛానల్ ద్వారా నిధులు మంజూరు చేయాలని తెలిపారు. అదేవిధంగా ప్రవాసుల నుంచి నిధులు సేకరించాలని పేర్కొన్నారు. ఇందుకోసం వారి సహకారం తీసుకోవాలని చెప్పారు. బడుల్లో డిజిటల్ తరగతి గదులు ఏర్పాటు చేయాలని అన్నారు. టీ-శాట్ ద్వారా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో డిజిటల్ పాఠాలు బోధించాలని రేవంత్‌రెడ్డి వెల్లడించారు.