తెలంగాణ

telangana

ETV Bharat / state

మూసీ ప్రక్షాళన చేసి తీరుతాం - జనవరి తొలివారం నుంచి పాదయాత్ర : ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి - CM REVANTH MUSI SANKALP YATRA

జనవరి తొలివారం నుంచి పాదయాత్ర చేస్తానని సీఎం ప్రకటన - మూసీ ప్రక్షాళనకు దుర్మార్గులు అడ్డొస్తున్నారని ధ్వజం - మూసీ పునరుజ్జీవ సంకల్పయాత్రలో భాగంగా 2.5 కి.మీ పాదయాత్ర చేసిన సీఎం

CM REVANTH REDDY YATRA IN SANGEM
CM Revanth Reddy Musi Punarjeevana Sankalp Yatra (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Nov 8, 2024, 5:07 PM IST

Updated : Nov 8, 2024, 7:23 PM IST

CM Revanth Reddy Musi Punarjeevana Sankalp Yatra :వచ్చే జనవరి తొలివారం నుంచి పాదయాత్ర చేస్తానని ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి ప్రకటించారు. వాడపల్లి నుంచి పాదయాత్ర ప్రారంభిస్తానని తెలిపారు. మూసీ నది కలుషితం కావడంతో వ్యవసాయం చేయట్లేదని ఉద్ఘాటించారు. మూసీ ప్రక్షాళనకు దుర్మార్గులు అడ్డొస్తున్నారని, అడ్డుపడే వారిలో బీఆర్‌ఎస్‌ ముందుందని మండిపడ్డారు. మూసీ పరివాహక ప్రాంతంలోని ఉత్పత్తులను ఎవరూ కొనట్లేదని, ఆ ప్రాంతంలో కల్లు కూడా అమ్ముకునే పరిస్థితి లేదని విచారం వ్యక్తం చేశారు. మూసీ నదిలో చేపలు బతుకుతున్నాయా అంటూ ప్రశ్నించారు. నది ఒడ్డున పెంచిన గొర్రెలను సైతం కొనే పరిస్థితి లేదని వ్యాఖ్యానించారు.

2.5 కి.మీ పాదయాత్ర :మూసీ పునరుజ్జీవం కార్యక్రమాన్ని చేపట్టేందుకు నిర్ణయం తీసుకున్న సీఎం రేవంత్​రెడ్డి ఇవాళ యాదాద్రి భువనగిరి జిల్లా సంగెం నుంచి సంకల్పయాత్ర చేపట్టారు. సంగెం లోలెవల్ బ్రిడ్జి నుంచి ధర్మారెడ్డిపల్లి కాలువ మీదగా 2.5 కి.మీ పాదయాత్ర చేశారు. అనంతరం కాలినడకన మూసీ పునరుజ్జీవ సభాస్థలికి చేరుకున్నారు. అక్కడ సంగెం గ్రామస్థులు మూసీ వల్ల కలిగే సమస్యలను ముఖ్యమంత్రికి వివరించారు. అంతకుముందు సంగెం మూసీ నది ఒడ్డునున్న భీమలింగం వద్ద సీఎం​ పూజలు చేశారు. మూసీ పునరుజ్జీవన యాత్రలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్​రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి, పొన్నం ప్రభాకర్​, కొండా సురేఖ పాల్గొన్నారు. సంకల్పయాత్రలో భారీ సంఖ్యలో కాంగ్రెస్ ​శ్రేణులు సైతం పాల్గొని సీఎం రేవంత్​రెడ్డి వెంట పాదయాత్ర చేశారు.

నల్గొండ జిల్లా ప్రజలను ఆదుకోవాలని బాధ్యత తీసుకుంటే కొందరు బుల్డోజర్లకు అడ్డం పడుతున్నారు. మీకు నిజంగానే చిత్తశుద్ధి, ధైర్యం ఉంటే తేదీ చెప్పండి మంత్రి కోమటిరెడ్డితోనే బుల్డోజర్లు ఎక్కిస్తా. కచ్చితంగా మూసీ ప్రక్షాళన చేసి తీరుతాం. మూసీ ప్రక్షాళన చేయండి అని ఇక్కడ ఉన్న ప్రతిఒక్కరూ అంటున్నారు'-రేవంత్​రెడ్డి, ముఖ్యమంత్రి

టీటీడీ తరహాలో యాదగిరి టెంపుల్‌ బోర్డు : మరోవైపు అంతకముందు యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధిపై అధికారులతో సీఎం రేవంత్​ సమీక్షించారు. యాదాద్రి పేరును యాదగిరిగుట్టగా మార్పుతోపాటు యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. టీటీడీ తరహాలో యాదగిరి టెంపుల్‌ బోర్డు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.

యాదాద్రి పేరు మారుతోంది - టీటీడీ తరహాలో టెంపుల్ బోర్డ్ - సమీక్షలో సీఎం ఆదేశాలు

Last Updated : Nov 8, 2024, 7:23 PM IST

ABOUT THE AUTHOR

...view details