CM Revanth Review On Floods in Mahabubabad : పేదల ప్రాణాలు పోతుంటే ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తూ కూర్చోదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. జిల్లాలో పర్యటించిన ఆయన, వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన అనంతరం మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీతక్కతో కలిసి వరదలపై సమీక్ష నిర్వహించారు. జిల్లాలో నలుగురు మృతి చెందడం చాలా బాధాకరమని సానుభూతి తెలిపారు.
దాదాపు 30వేల ఎకరాల్లో పంటనష్టం వాటిల్లిందని అధికారులు అంచనా వేస్తున్నట్లు వెల్లడించారు. అలానే సహాయచర్యల్లో నిరంతరం పనిచేసిన రెవెన్యూ, పోలీసు సిబ్బందిని ముఖ్యమంత్రి అభినందించారు. అధికారుల చర్యలతో ప్రాణనష్టం చాలావరకు తగ్గించగలిగామని పేర్కొన్నారు. ప్రతిక్షణం అప్రమత్తంగా ఉంటూ బాధితులను ఆదుకుంటున్నామన్న సీఎం, ప్రజలు బాధల్లో ఉంటే ప్రతిపక్ష నేత ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. గతంలో మానవత్వం లేని వ్యక్తి పదేళ్లు పాలన చేశారని దుయ్యబట్టారు.
ఆక్రమణల తొలగింపునకు ప్రభుత్వం ప్రాధాన్యం :చెరువులు, నాలాల ఆక్రమణల తొలగింపునకు ప్రాధాన్యమిస్తామన్న రేవంత్, పువ్వాడ ఆక్రమణలు తొలగించాలని హరీశ్‌రావు డిమాండ్ చేయగలరా అని ప్రశ్నించారు. వరదల నష్టంపై కేంద్రానికి నివేదించడానికి నివేదిక తయారు చేయాలని అధికారుల ఆదేశించినట్లు సీఎం వివరించారు. వరదలను జాతీయ విపత్తుగా పరిగణించి రూ.2,000 కోట్లు ఇవ్వాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసిన సీఎం, ప్రధాని స్వయంగా రాష్ట్ర పర్యటనకు రావాలని పిలుపునిచ్చారు.