CM Revanth Redddy Election Campaign in Mahabubnagar :మీ అభిమానం చూస్తుంటే తన హృదయం తన్మయం చెందుతోందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 40 ఏళ్ల నుంచి కొత్తకోటతో నాకు అనుబంధం ఉందన్నారు. గతంలో చిన్నారెడ్డి ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు తాను గోడలపై రాతలు రాశానని గుర్తు చేశారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 14కు గానూ 12 మంది ఎమ్మెల్యేలను గెలిపించారని పేర్కొన్నారు. మహబూబ్‌నగర్‌లో కాంగ్రెస్‌కు లక్ష మెజారిటీ ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. మహబూబ్‌నగర్‌లోని కొత్తకోట వద్ద జరిగిన కార్నర్ మీటింగ్‌లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.
పదమూడేళ్ల వయసులో వనపర్తికి ఏడో తరగతి చదివేందుకు వచ్చానని, ఏడో తరగతి చదివేటప్పటి నుంచి నాకు వనపర్తితో అనుబంధం ఉందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. రాష్ట్రానికి పాలమూరు జిల్లాకు చెందిన వ్యక్తి సీఎంగా ఉండొద్దని దిల్లీ నుంచి వచ్చినవారు చూస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. డీకే అరుణకు కాంగ్రెస్ ఏం తక్కువ చేసిందని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డిని ఎమ్మెల్యేగా, ఎంపీగా, ఇప్పుడు ముఖ్యమంత్రిని చేసిందన్నారు. వంశీచంద్ రెడ్డిని గెలిపిస్తే పాలమూరు జిల్లాకు ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌లోని 14 నియోజకవర్గాల అభివృద్ధికి ప్రణాళిక సిద్ధం చేయాలని చిన్నారెడ్డికి చెప్పానని వివరించారు.
వ్యాపారాలు, పదవుల కోసం మాత్రమే డీకే అరుణ ముందు ఉంటారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా అభివృద్ధికి డీకే అరుణ ఎందుకు కృషి చేయలేదని ప్రశ్నించారు. మోదీ, అమిత్ షా అండతో తనపై దిల్లీలో కేసు పెట్టించారన్నారు. బీజేపీ రిజర్వేషన్ల రద్దు చేస్తామంటే ఊరుకునేది లేదని తాను చెప్పానని అన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాను ఎడారి చేయాలని చాలామంది చూస్తున్నారని ధ్వజమెత్తారు. డీకే అరుణ రాష్ట్ర ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపణలు చేశారు.