తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆ 3 లక్షల మందికి నేడు రుణమాఫీ - రైతు భరోసాపై సాయంత్రం సీఎం తీపికబురు! - RYTHU FESTIVAL IN MAHABUBNAGAR

ప్రజా విజయోత్సవాల్లో భాగంగా మహబూబ్​నగర్ వేదికగా రైతులకు నేడు రుణమాఫీ - సాంకేతిక కారణాలతో నిలిచిపోయిన 3 లక్షల మంది ఖాతాల్లో డబ్బులు జమ చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy On Rythu Festival
CM Revanth Reddy On Rythu Festival In Mahabubnagar (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Nov 30, 2024, 11:58 AM IST

CM Revanth Reddy On Rythu Festival In Mahabubnagar: ప్రజా విజయోత్సవాల్లో భాగంగా మహబూబ్​నగర్ వేదికగా రైతులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరాల జల్లు కురిపించనున్నారు. సాంకేతిక కారణాలతో నిలిచిపోయిన రుణమాఫీ డబ్బులను నేడు విడుదల చేయనున్నట్లు సమాచారం. దాదాపు 3 లక్షల మంది రైతులకు రూ.3 వేల కోట్లను నాలుగో విడతగా రాష్ట్ర సర్కార్ అందించనుంది. రైతు పండుగ ముగింపు వేడుకల భారీ బహిరంగ సభకు ఇప్పటికే సర్వం సిద్ధమైంది. ఏడాది పాలనపై విమర్శలు గుప్పిస్తున్న విపక్షాలకు సభా వేదికగా ముఖ్యమంత్రి ధీటైన సమాధానం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

మహబూబ్​నగర్ జిల్లా భూత్పూరులో నిర్వహిస్తున్న రైతు పండుగ ముగింపునకు సీఎం రేవంత్ రెడ్డి నేడు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలోనే అమిస్తాపూర్​లో నిర్వహించే బహిరంగ సభకు సర్వం సిద్ధమైంది. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ఈ నెల 28 నుంచి 30వ తేదీ వరకు రైతు పండుగ వేడుకలను సర్కారు నిర్వహిస్తోంది. అత్యాధునిక సాగు పద్ధతులు, లాభసాటి పంటలు వ్యవసాయ యాంత్రీకరణ, ఆధునిక పోకడలపై కర్షకులకు అవగాహన కల్పించేందుకు 150కి పైగా స్టాళ్లు ఏర్పాటు చేశారు. మూడో రోజు కార్యక్రమాలు కొనసాగనుండగా, ఉమ్మడి జిల్లా సహా చుట్టు పక్కల జిల్లా నుంచి రైతులను రప్పిస్తున్నారు.

హైదరాబాద్ నుంచి హెలికాప్టర్​లో అమిస్తాపూర్ చేరుకోనున్న రేవంత్ రెడ్డి, తొలుత రైతు పండుగ ప్రదర్శనను తిలకిస్తారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. సభ ముగిసిన తర్వాత రోడ్డు మార్గంలో హైదరాబాద్​కు తిరుగు పయనమవుతారు. అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి అవుతున్న సందర్భంగా కాంగ్రెస్ పాలనపై విమర్శలు గుప్పిస్తున్న విపక్షాలకు కనువిప్పు కలిగేలా ఆ సభ ఉండబోతోందని ఇప్పటికే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు.

పదేళ్లలో బీఆర్ఎస్ ఏం చేసిందో, 10 నెలల్లో కాంగ్రెస్ సర్కార్ ఏం చేసిందో లెక్కలతో చెబుతామన్నారు. రుణమాఫీ, రైతు భరోసాకి సంబంధించి రైతులకు సీఎం తీపి కబురు అందించనున్నారు. సాంకేతిక కారణాలతో నిలిచిపోయిన దాదాపు 3 లక్షల మంది రైతులకు రూ.3 వేల కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ఈ విడతలో అందించనుంది.

సభ విజయవంతానికి అధికార యంత్రాంగం, కాంగ్రెస్ ప్రతినిధులు కసరత్తులు ముమ్మరం చేశారు. ఉమ్మడి మహబూబ్​నగర్ జిల్లా సహా సమీపంలోని రంగారెడ్డి, నల్గొండ, వికారాబాద్ సహా ఇతర జిల్లాల నుంచి అన్నదాతలను రప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సభకు వచ్చే రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టంది. సీఎం పర్యటన దృష్ట్యా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. మహబూబ్​నగర్, భూత్పూర్ మార్గంలో ప్రయాణించే వాహనాలను బైపాస్, జడ్చర్ల మీదుగా దారి మళ్లిస్తున్నారు.

రైతులు తమకు ఏ పథకం మంచిదో చెబితే - అవే కొనసాగిస్తాం : మంత్రి తుమ్మల

అన్నదాతలకు గుడ్​న్యూస్ - ఈ నెల 30న ఖాతాల్లోకి ఆ డబ్బులు

ABOUT THE AUTHOR

...view details