CM Revanth Reddy On Padma Awards 2025 : తెలుగు రాష్ట్రాల నుంచి పద్మా అవార్డులకు ఎంపికైన వారికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సహా రాష్ట్రంలోని పలువురు ప్రముఖులు అభినందనలు తెలిపారు. వివిధ రంగాల్లో అంకిత భావంతో పని చేసిన వారికి గుర్తింపు దక్కడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. వారి స్ఫూర్తి భవిష్య తరాలకు ఆదర్శనీయమని కొనియాడారు.
నందమూరి బాలకృష్ణకు పద్మ భూషణ్ : భారత ప్రభుత్వం పద్మ పురస్కారాలు - 2025 జాబితాను ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల్లో వైద్య రంగానికి సంబంధించి పద్మవిభూషణ్ పురస్కారానికి ఎంపికైన దువ్వూరు నాగేశ్వర్ రెడ్డికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అభినందనలు తెలిపారు. సినిమా రంగంలో తనదైన ముద్ర వేసిన నందమూరి బాలకృష్ణకు పద్మ భూషణ్, ప్రజా వ్యవహారాల విభాగంలో మంద కృష్ణ మాదిగ, కళలు, సాహిత్యం, విద్యా విభాగాల్లో కే.ఎల్.కృష్ణ, మాడుగుల నాగఫణిశర్మ, దివంగత మిర్యాల అప్పారావు, రాఘవేంద్రాచార్య పంచముఖిలకు పద్మశ్రీ పురస్కారాలు దక్కడంపై ముఖ్యమంత్రి హర్షం వ్యక్తం చేశారు. తాము ఎంచుకున్న రంగంలో చేసిన కృషి అంకితభావమే వారిని దేశంలోని ఉన్నత పురస్కారాలకు ఎంపికయ్యేందుకు కారణమయ్యాయని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. నాగేశ్వర్ రెడ్డి స్ఫూర్తి భవిష్య తరాలకు ఆదర్శనీయమని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఎక్స్ వేదికగా కొనియాడారు.
కిషన్ రెడ్డి అభినందనలు :తెలుగు రాష్ట్రాల నుంచి పద్మ అవార్డులకు ఎంపికైన వారందరికీ కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అభినందనలు తెలియజేశారు. ఆయా రంగాల్లో ప్రత్యేకత గుర్తింపును సంపాదించుకున్న వారి సేవలకు కేంద్ర ప్రభుత్వం సరైన గుర్తింపుతో గౌరవించిందన్నారు. పద్మ అవార్డులకు ఎంపికైన వారిని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అభినందించారు. పద్మ విభూషణ్, పద్మ భూషణ్, పద్మ శ్రీ పురస్కారాలకు ఎంపికైన వారికి ఆయన హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు.