CM Revanth Reddy Collectors Meeting :ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు సచివాలయంలో కలెక్టర్లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా డిసెంబర్ 24, 2023న కలెక్టర్లతో మొదటిసారి సమావేశం నిర్వహించామని, ప్రజాపాలన ద్వారా దరఖాస్తులు స్వీకరించి నిజమైన లబ్ధిదారులను గుర్తించాలని ఆ సమావేశంలో ఆదేశించామని సీఎం గుర్తు చేశారు. ఎన్నికల కోడ్ ముగియగానే పారదర్శకంగానే కలెక్టర్ల బదిలీలు నిర్వహించామన్న ఆయన, ప్రభుత్వానికి కళ్లు, చెవులు జిల్లా పాలనాధికారులేనని, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారంతా తెలంగాణ సంస్కృతిలో భాగస్వామ్యమైతేనే ప్రజలకు సరైన సేవలు అందించగలుగుతారని సూచించారు. తెలంగాణను తమ సొంత రాష్ట్రంగా భావించి పని చేయాలన్నారు. ఈ మేరకు కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు.
ప్రజలకు ప్రయోజనం చేకూరేలా మానవీయ కోణంలో నిర్ణయాలు ఉండాలని కలెక్టర్లకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఒక శంకరన్, ఒక శ్రీధరన్ మాదిరిగా సామాన్య ప్రజలు ఎప్పుడూ గుర్తు పెట్టుకునేలా పని చేయాలని అన్నారు. క్షేత్రస్థాయిలో ప్రజల ఆలోచన ఏంటో తెలుసుకోవాలని చెప్పారు. కేవలం ఏసీ గదులకే పరిమితమైతే మీకూ ఎలాంటి సంతృప్తి ఉండదన్న ఆయన, మీ ప్రతి చర్య ఇది ప్రజా ప్రభుత్వం అని ప్రజలకు తెలిసేలా ఉండాలని స్పష్టం చేశారు.
"ఈ ప్రజా ప్రభుత్వంలో పారదర్శక ప్రజాహిత పాలన అందించాలి. సంక్షేమం, అభివృద్ధిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మీపైనే ఉంది. కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటించాల్సిందే. తెలంగాణ పునర్నిర్మాణంలో విద్యా వ్యవస్థ అత్యంత కీలకం. విద్యా వ్యవస్థ దెబ్బతినకుండా చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ స్కూళ్లు, ప్రభుత్వ ఆసుపత్రులను పర్యవేక్షించాల్సిన బాధ్యత కలెక్టర్లు తీసుకోవాలి." అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.