Telangana Formation Day Invitation to Former CM KCR :మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను జూన్ 2వ తేదీన నిర్వహించనున్న తెలంగాణ దశాబ్ది ఉత్సవాలకు సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. వ్యక్తిగతంగా లేఖ రాయడంతో పాటు ఆహ్వానాన్ని కూడా ఆయనకు పంపారు. ప్రభుత్వ ప్రొటోకాల్ సలహాదారు హర్కర్ వేణుగోపాల్, డైరెక్టర్ అరవింద్ సింగ్‌లు సీఎం సూచన మేరకు ఆహ్వాన లేఖ, ఆహ్వాన పత్రిక రెండింటినీ తీసుకుని ఫామ్ హౌస్‌కు వెళ్లినట్లు తెలుస్తోంది. జూన్ 2వ తేదీన ఉదయం 10 గంటలకు పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించనున్న తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో పాల్గొనాలంటూ కేసీఆర్‌ను ఆహ్వానించనున్నారు. ప్రభుత్వ ప్రొటోకాల్ సలహాదారుడు హర్కర్ వేణుగోపాల్ ఫామ్‌హౌస్‌కు వెళ్లి స్వయంగా ఆహ్వానాన్ని, సీఎం రేవంత్ రాసిన లేఖను అందజేయనున్నారు.
Sonia Gandhi Attends Telangana Formation day Celebrations : తెలంగాణ రాష్ట్ర దశాబ్ది వేడుకలకు కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ హాజరుకానున్నారు. ఈ మేరకు సోనియాగాంధీ కార్యాలయం నుంచి సీఎం కార్యాలయానికి సమాచారం అందినట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్ర అవతరణ వేడుకలకు హాజరు కావాలని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా దిల్లీ వెళ్లి సోనియాగాంధీని ఆహ్వానించారు. అయితే సోనియాగాంధీ పర్యటనకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ రావాల్సి ఉందని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. దశాబ్ది ఉత్సవాలకు హాజరుకానున్నట్లు సోనియాగాంధీ ప్రభుత్వానికి సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది.
అసెంబ్లీలో చర్చించాకే అధికార చిహ్నం, తెలంగామ తల్లి రూపంపై తుది నిర్ణయం : రాష్ట్ర అధికార చిహ్నం, తెలంగాణ తల్లి రూపంపై అసెంబ్లీలో చర్చించాకే తుది నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. అధికార చిహ్నంపై రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల కళాకారుల నుంచి సుమారు 500 నమూనాలు అందినట్లు సీఎం చెప్పారు. నమూనాలన్నింటినీ పరిశీలించి చర్చిస్తున్నట్లు తెలిపారు.