CM revanth Reddy Felicitation To Padma Award Winners : మట్టిలో మాణిక్యాలను గుర్తించి కేంద్రం పద్మశ్రీ పురస్కారాలను ఇచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పద్మ అవార్డు గ్రహీతలకు హైదరాబాద్ శిల్పా కళావేదికలో రాష్ట్ర ప్రభుత్వం సన్మాన కార్యక్రమం నిర్వహించింది. పద్మ విభూషణ్ అవార్డు గ్రహీతలు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, సినీ నటుడు చిరంజీవి సహా పురస్కారాలు అందుకున్న వారిని సీఎం రేవంత్ రెడ్డి సన్మానించారు.పద్మశ్రీగెలుపొందిన తెలంగాణ కళాకారులను ఆయన సత్కరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ మాట్లాడుతూ వెంకయ్యను సన్మానించడం మనల్ని మనమే సన్మానించుకోవడం అన్నారు. దిల్లీ వెళ్లే తెలుగు రాజకీయ నేతలకు వెంకయ్య నాయుడు పెద్ద దిక్కు అని చెప్పారు.
Padma Award Winners 2024 : 'దిల్లీ వెళ్లే తెలుగు రాజకీయ నేతలకు వెంకయ్యనాయుడు పెద్ద దిక్కు. ఆయన్ను సన్మానించడం, మనల్ని మనం సన్మానించుకోవడమే. చిరంజీవి పున్నమినాగులో ఏ స్థాయిలో నటించారో, సైరాలోనూ అదే స్థాయిలో నటించారు. ఇది రాజకీయాలకు అతీతంగా ఏర్పాటు చేసిన కార్యక్రమం. పద్మ అవార్డు గ్రహీతలను సన్మానించడం ఒక బాధ్యతగా భావించాం. తెలుగువాళ్లు ఎక్కడ ఏ ప్రాంతంలో ఉన్నా మనవారే. ఒక మంచి సంప్రదాయానికి పునాది వేసేందుకే ఈ కార్యక్రమం. ఈ సంప్రదాయాన్ని ఇలాగే కొనసాగించాలి. అవార్డు గ్రహీతలు ప్రభుత్వాన్ని అభినందించడమంటే, మన ప్రజా పాలనను అభినందించినట్లే. పద్మశ్రీ అవార్డు గ్రహీతలకు రూ.25 లక్షల నగదు బహుమతి ప్రభుత్వం తరపున అందిస్తున్నాం. దీంతో పాటు పద్మశ్రీ అవార్డు పొందిన కవులు, కళాకారులకు ప్రతి నెలా రూ.25 వేల పెన్షన్ ఇవ్వాలని నిర్ణయించాం.' అని రేవంత్ రెడ్డి అన్నారు.