CM Revanth Review on Project Levels : రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రాజెక్టులో నీటినిల్వపై అధికారులతో సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించారు. ఎగువన కురిసిన వర్షాలతో పాటు కడెం నుంచి వస్తున్న వరదతో పెద్దపల్లి జిల్లాలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నిండిందని, ఎల్లంపల్లి గేట్లు ఎత్తి నీటిని గోదావరిలోకి వదులుతున్నట్లు సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్‌కుమార్ తెలిపారు. ఎల్లంపల్లికి వచ్చిన వరద నీటిని వీలైనంత మేరకు ఎత్తిపోయాలని, రోజుకు ఒక టీఎంసీకి తగ్గకుండా డ్రా చేయాలని అధికారులను ఆదేశించారు.
ఏకధాటిగా లిఫ్టింగ్‌కు ఆదేశం : నంది, గాయత్రి పంప్‌హౌస్‌ల ద్వారా లిఫ్ట్ చేసి రిజర్వాయర్లు నింపాలని ముఖ్యమంత్రి రేవంత్ సూచించారు. మిడ్ మానేరు, లోయర్ మానేరు డ్యామ్‌తో పాటు రంగనాయక సాగర్, మల్లన్నసాగర్ వరకు జలాశయాల్లోకి ఏకధాటిగా నీటిని లిఫ్ట్ చేయాలని ఆదేశించారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు సామర్ధ్యం 20 టీఎంసీలు కాగా ప్రస్తుతం 18.45 టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు. కడెం ప్రాజెక్టు నుంచి ప్రవాహం ఉద్ధృతంగా వస్తుండటంతో నంది, గాయత్రి పంప్ హౌస్‌ల ద్వారా మిడ్ మానేరుకు నీటిని తరలిస్తున్నట్లు తెలిపారు.
నిజాంసాగర్ వరకు పంపింగ్ :మిడ్‌మానేరు ప్రాజెక్టు సామర్ధ్యం 27 టీఎంసీలు కాగా ప్రస్తుతం 15 టీఎంసీలు సీఎం రేవంత్‌కు అధికారులు వివరించారు. అక్కడి నుంచి 14 వేల క్యూసెక్కులకు పైగా లోయర్ మానేరు డ్యామ్‌కు, మరో 6400 క్యూసెక్కులు అన్నపూర్ణ రిజర్వాయర్ ద్వారా రంగనాయక్ సాగర్‌కు తరలిస్తున్నట్లు వివరించారు. రంగనాయక సాగర్ నుంచి నీటిని పంపింగ్ చేసి మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ నింపాలని అక్కడి నుంచి సింగూరు, నిజాంసాగర్ ప్రాజెక్ట్ వరకు నీటిని తరలించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.