CM Revanth Reddy On Formula E car Race :రూ.55కోట్లు కాదు రూ.600 కోట్లు దోచిపెట్టేందుకు ఫార్ములా ఈ- రేస్ నిర్వహకులతో మాజీ మంత్రి కేటీఆర్ ఒప్పందం చేసుకున్నారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వివరించారు. రేసింగ్ నిర్వహకులు వచ్చి తనతో సమావేశం కావడం వల్లే అసలు విషయం వెలుగుచూసిందని తెలిపారు. మంత్రివర్గం, ఆర్‌బీఐ అనుమతి లేకుండానే పౌండ్స్ రూపంలో చెల్లించారన్న రేవంత్‌రెడ్డి అక్రమాల బాగోతాన్ని నిగ్గుతేల్చేందుకు విచారణకు ఆదేశించినట్లు చెప్పారు. నాలుగుసార్లు అసెంబ్లీ సమావేశాలు జరిగితే ఫార్ములా ఈ రేసింగ్‌పై చర్చించాలని బీఆర్ఎస్ ఎందుకు పట్టుపట్టలేదన్న ఆయన ఈ కార్ రేసింగ్‌పై ఏసీబీ విచారణ కొనసాగటం, హైకోర్టులో విచారణ జరుగుతున్నందునే తాను ఎక్కువగా మాట్లాడటం లేదని అన్నారు.
CM Revanth Allegations On KTR :600 కోట్ల పెండింగ్ బకాయిలు చెల్లించాలంటూ ఫార్ములా రేసింగ్ నిర్వాహకులు వచ్చి తనను కలవడం వల్లే అసలు విషయం వెలుగులోకి వచ్చిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వెల్లడించారు. రేసింగ్ నిర్వహకులు వచ్చి తనను కలుస్తామని చెప్పడం వల్లే అనుమతి ఇచ్చానని వారితో ఫోటో దిగినట్లు వివరించారు. ప్రభుత్వం సహకరిస్తే మరోసారి ఫార్ములా రేసింగ్ నిర్వహిస్తామని అడిగారన్న సీఎం ఆ విషయంపై ఆరా తీయడం వల్లే కేటీఆర్ బాగోతం బయటకు వచ్చిందని తెలిపారు. రేసింగ్ నిర్వాహకులతో కేటీఆర్ కుదుర్చుకున్నది రూ.55 కోట్ల ఒప్పందం కాదని సీఎం రేవంత్‌రెడ్డి తేల్చిచెప్పారు. మంత్రివర్గం ఆమోదం లేకుండా ప్రజాధనాన్ని దుబారాగా ఎలా ఖర్చు చేస్తారని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
"ఈ కార్ రేసు వ్యవహారంలో వీరు చేసుకుంది రూ.600 కోట్లు ఇవ్వడానికే . 55 కోట్లు ఇయ్యంగానే నేను పట్టుకున్నా కాబట్టి 500 కోట్లు మిగిలిపోయినాయి. లేకపోతే ఆయన జరా ఊ అంటే అంటే రూ.600 కోట్లు పోయేవి. రూ.55 కోట్ల ప్రజాధనం పోతే అది చిన్నమొత్తమా?. ప్రభుత్వ సొమ్ముకు జవాబుదారిగా ఉండాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధుల పై ఉంది. సంవత్సరం నుంచి నానుతున్న విషయంపై నాలుగు సమావేశాల్లో ఏ రోజైనా ఫార్ములా రేసు గురించి బీఆర్ఎస్ ఎప్పుడైనా మాట్లాడిందా? ఈ అంశానికి సంబంధించి ఎక్కడైనా ఎప్పుడైనా చర్చకు సిద్ధం" - రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి