Union Minister Shivraj Singh Chauhan Inspect Flood Situation in TG :వరద తాకిడితో అల్లాడిన ఖమ్మం, పాలేరు, మధిర ప్రాంతాల్లో పర్యటించిన కేంద్రమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ అనంతరం సచివాలయం చేరుకున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సాధర స్వాగతం పలికి, శాలువాతో సత్కరించారు. వరద నష్టంపై సీఎం రేవంత్‌రెడ్డితో కలిసి సమీక్షలో మరో కేంద్రమంత్రి బండి సంజయ్ పాల్గొన్నారు. కేంద్రమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌తో సీఎం రేవంత్‌రెడ్డి సమావేశమై, వివిధ జిల్లాల్లో జరిగిన వరద నష్టాన్ని వివరించారు. రాష్ట్రంలో వరద నష్టం తీవ్రంగా ఉందని, తక్షణ సాయంతో పాటు శాశ్వత పునరుద్ధరణ పనులకు తగిన నిధులు కేటాయించాలని సీఎం కోరారు. సుమారు రూ.5,438 కోట్ల నష్టం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేసినట్లు ముఖ్యమంత్రి వివరించారు.
ఎన్డీఆర్ఎఫ్ నిధుల విడుదల విషయంలో మార్గదర్శకాలను సడలించాలని కేంద్ర మంత్రిని రేవంత్ రెడ్డి కోరారు. ఏపీకి ఎలాంటి సాయం చేస్తారో తెలంగాణకూ అదే స్థాయిలో చేయాలని, రెండు రాష్ట్రాలనూ ఒకే విధంగా చూడాలని సీఎం కోరారు. సచివాలయంలో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు వరద ప్రభావం, నష్టాన్ని ముఖ్యమంత్రి, అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్, ఫోటోలతో వివరించారు. పలు జిల్లాల్లో ఒక్కరోజే 40 సెంటిమీటర్ల వరకు వర్షం కురిసిందని, వరద ప్రభావిత జిల్లాల్లోని గ్రామాల్లో పరిస్థితి దారుణంగా ఉందని సీఎం చెప్పారు. రోడ్లు, ఇళ్లు, బ్రిడ్జిలు పూర్తిగా దెబ్బతిన్నాయని రాకపోకలు స్తంభించాయని ముఖ్యమంత్రి కేంద్రమంత్రికి వివరించారు.