CM Revanth Reddy Bhadradri Tour: దక్షిణ అయోధ్యగా భాసిల్లుతున్న భద్రాచలంలో ఈ నెల 11న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. ఐదు సంవత్సరాల క్రితం రామాలయ అభివృద్ధికి త్రిదండి చిన జీయర్‌స్వామి, ఆర్కిటెక్ట్ ఆనంద్‌సాయి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రణాళిక రూపొందించినా కార్యరూపం దాల్చలేదు. బీఆర్ఎస్ సర్కారు రూ.150 కోట్లు ప్రకటించినా పైసా కేటాయించలేదు.
భద్రాచలం పుణ్యక్షేత్రం అభివృద్ధిపై హైదరాబాద్‌లో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖతో కలిసి సీఎం రేవంత్‌రెడ్డి ఉన్నత స్థాయి సమీక్షను బుధవారం నిర్వహించనున్నట్లు తెలిసింది. పాత బృహత్తర ప్రణాళిక అమలు చేస్తారా? లేదంటే ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తారా అన్నది తేలాల్సి ఉంది.
భద్రాద్రి రామయ్య కల్యాణానికి ముహూర్తం ఫిక్స్ - ఏప్రిల్ 9 నుంచి బ్రహ్మోత్సవాలు
మాడవీధులను పొడిగించి ప్రాకారాలు నిర్మించాలని, ఆలయం చుట్టూ 160 అడుగుల మేర కోవెలను విస్తరించాలని భక్తులు విన్నవించుకుంటున్నారు. అడ్డుగా ఉన్న ఇళ్లను తొలగించి న్యాయబద్ధంగా పరిహారం చెల్లించాలని కోరుతున్నారు. మిథిలా మండపానికి ఇబ్బంది కలగకుండా ప్రాంగణాన్ని సువిశాలం చేయాలని తెలుపుతున్నారు. అన్నదాన సత్రం విస్తరణకు సమీపంలోని సర్కారు భూమిని అప్పగించాలని, రోజుకు లక్ష మంది భక్తులు వచ్చినా శీఘ్ర దర్శనమయ్యేలా క్యూలైన్ల రూపకల్పన ఉండాలని కోరారు. వసతి గదులను పెంచి, పార్కింగ్ సమస్యలు, రాముడి భూముల్లో ఆక్రమణలను జరుగుతున్నాయని వాటిని తొలగించాలని అధికారులను కోరుతున్నారు. గోశాలను విస్తరించి రామకోటి స్తూపాలు ఏర్పాటు చేయాలన్నారు.